స్వల్పంగానే తిరస్కరణలు
ABN , Publish Date - Jun 04 , 2026 | 03:28 AM
దక్షిణాది పొగాకు మార్కెట్‌లో బేళ్ల తిరస్కరణలు కాస్తంత తగ్గాయి. నాలుగు రోజుల క్రితంతో పోల్చితే కొంత మార్పు కనిపిస్తోంది. ఈనెల 1న పొగాకు రైతులు గుంటూరులోని బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన నేపథ్యంలో మార్కెట్లో కొంత మార్పు వచ్చిందా అన్నట్లు ప్రస్తుతం వేలం సాగుతోంది.
ఎస్‌బీఎస్‌లో నాలుగో వంతు తిరస్కరణ
రైతు, వ్యాపార ప్రతినిధులతో భేటీ వాయిదా
వేలం తీరును పరిశీలించిన బోర్డు చైర్మన్
కర్ణాటకలో పూర్తయ్యే వరకు ఇక్కడ మందకొడిగానే కొనుగోళ్లు
ఒంగోలు జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్‌లో బేళ్ల తిరస్కరణలు కాస్తంత తగ్గాయి. నాలుగు రోజుల క్రితంతో పోల్చితే కొంత మార్పు కనిపిస్తోంది. ఈనెల 1న పొగాకు రైతులు గుంటూరులోని బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన నేపథ్యంలో మార్కెట్లో కొంత మార్పు వచ్చిందా అన్నట్లు ప్రస్తుతం వేలం సాగుతోంది. అదే సమయంలో నిత్యం తిరస్కరణలతో విసుగు చెందిన రైతులు.. అధికారులు, బయ్యర్ల సూచనలకు అనుగుణంగా బేళ్లను తెస్తుండటమే ఇందుకు కారణమంటున్నారు. కారణం ఏదైనా నాలుగు రోజుల క్రితం వరకు సగటున 40 నుంచి 45శాతం, కొన్నిచోట్ల ఏకంగా 60 నుంచి 70శాతం బేళ్లు తిరస్కరణకు గురికాగా రెండు, మూడు రోజులుగా అవి తగ్గాయి. బుధవారం మార్కెట్‌ను పరిశీలిస్తే ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్‌లో నోబిడ్‌లు 10శాతం లోపుగానే ఉన్నాయి. ఆ రీజియన్‌లోని ఆరు కేంద్రాల్లో 2,390 బేళ్లను రైతులు వేలానికి తీసుకురాగా వ్యాపారులు 1,965 కొనుగోలు చేశారు. 425 బేళ్లను తిరస్కరించారు. వాటిలో 9.50శాతంతో 227 బేళ్లు నోబిడ్ అయ్యాయి. అదే ఎస్‌బీఎస్ రీజియన్‌లో నోబిడ్‌లు 26శాతం వరకు ఉన్నాయి. ఈ రీజియన్‌లోని ఐదు వేలం కేంద్రాలకు 1,325 బేళ్లను తీసుకురాగా 26.11శాతంతో 346 బేళ్లు నోబిడ్ అయ్యాయి. అలా తిరస్కరణలు తగ్గుదల రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది.
వ్యాపారులు, రైతు ప్రతినిధుల సమావేశం వాయిదా
గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో వ్యాపార, రైతు ప్రతినిఽధులతో బుధవారం తలపెట్టిన సమావేశం వాయిదా పడింది. రెండు రోజుల క్రితం సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళన చేపట్టిన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించి చర్చించి మార్కెట్ మెరుగ్గా సాగేలా చర్యలు చేపడతామని బోర్డు ఈడీ విశ్వశ్రీ ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. సమావేశంపై వేలం కేంద్రాల రైతు కమిటీ నాయకులకు కూడా సమాచారం పంపారు. అయితే బోర్డు ఈడీ విశ్వశ్రీ ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో ఈ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
జిల్లాలో పొగాకు బోర్డు చైర్మన్ పర్యటన
పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్ బుధవారం జిల్లాలో పర్యటించారు. వెల్లంపల్లి, ఒంగోలు-2 వేలం కేంద్రాలను సందర్శించి పొగాకు కొనుగోళ్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. త్వరలో మార్కెట్ కుదుటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పొగాకు మర్కెట్లో మరో పక్షం రోజుల వరకు ఇలాగే ఒడిదొడుకులతోనే సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
కర్ణాటకలో పరిస్థితి ఇలా..
కర్ణాటకలో వేలం ఈనెల 20 వరకు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అక్కడ 87 మిలియన్ కిలోల ఉత్పత్తి అంచనా వేయగా ఇప్పటికే 94 మిలియన్ కిలోల కొనుగోలు జరిగింది. ఇంకా ఉండటంతో మరో పక్షం రోజులు వేలం నడుస్తుందని తెలుస్తోంది. అది పూర్తయితేనే ఇక్కడ మార్కెట్ భవిష్యత్‌పై పూర్తి స్పష్టత వస్తుందని ఆ రంగంలోని అనుభవజ్ఞులు అంచనా వేస్తున్నారు.