Share News

ఖరీఫ్‌లో ఆరు.. రబీలో ఆరు

ABN , Publish Date - Jul 11 , 2026 | 03:06 AM

ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో పంటల బీమా పథకం వర్తింపుపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా రెండింటి పరిధిలోనూ ఉమ్మడి జిల్లాలో పలురకాల పంటలకు ఇన్సూరెన్స్‌ వర్తించనుంది.

ఖరీఫ్‌లో ఆరు.. రబీలో ఆరు

ప్రధాన మంత్రి ఫసల్‌ బీమాలో ఉమ్మడి జిల్లా పంటలకు వర్తింపు

వాతావరణ ఆధారిత జాబితాలో పత్తికి చోటు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు మేలు

ఒంగోలు, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో పంటల బీమా పథకం వర్తింపుపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా రెండింటి పరిధిలోనూ ఉమ్మడి జిల్లాలో పలురకాల పంటలకు ఇన్సూరెన్స్‌ వర్తించనుంది. అతివృష్టి, అనావృష్టి, తుఫాన్‌లు, వర్షాలు ఏటా ఏదో ఒకటి సంభవించి ఉమ్మడి జిల్లాలోని ఏదో ఒకప్రాంత రైతులు నష్టపోతుండటం సర్వసాధారణమైంది. అలాంటి వారికి ఈ బీమా పథకాల వల్ల మేలు చేకూరనుంది. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకం జిల్లాలో 12 రకాల పంటలకు వర్తించ నుంది. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ పథకం కింద ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన పంటలలో ఆరింటికి, రబీ సీజన్‌లో మరో ఆరు రకాలకు లబ్ధి అందనుంది. ఖరీఫ్‌ సీజన్‌లో వరి, కంది, మిర్చి, సజ్జ, మినుము, నువ్వు పంటలు.. రబీ సీజన్‌లో వరి, మొక్కజొన్న, శనగ, మినుము, మిర్చి, జొన్న పంటలు ఉన్నాయి. అలా ఉమ్మడి జిల్లాలో కీలకమైన వాటిలో ఇంచుమించు అన్ని పంటలకూ బీమా పథకం వర్తించనుంది. ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంటకు గ్రామం యూనిట్‌గా బీమా ఉంటుంది. కంది, మిర్చి, సజ్జ పంటలకు మండలం యూనిట్‌గా.. నువ్వు, మినుము పంటలకు జిల్లా యూనిట్‌గా పథకాన్ని అమలు చేస్తారు. రబీ సీజన్‌లో శనగ పంటకు గ్రామం యూనిట్‌గా తీసుకుంటారు. వరి, జొన్న, మినుము, మిర్చి పంటలకు మండలం యూనిట్‌గా, మొక్కజొన్నకు జిల్లా యూనిట్‌గా వర్తింపజేస్తారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో ఉమ్మడి జిల్లాలో పత్తిని చేర్చారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా పథకం వర్తిస్తుంది. బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందిన వారికి ఆ రుణాల నుంచే బీమా ప్రీమియం చె ల్లించేలా నిర్దేశించారు. రుణాలు పొందిన రైతులు బీమా పథకం అవసరం లేదని భావిస్తే ఆ మేరకు రాతపూర్వకంగా బ్యాంకులకు తెలియజేయాలి. అలాంటి వారి రుణ మొత్తం నుంచి ప్రీమియంను బ్యాంకులు కటింగ్‌ చేయకుండా మొత్తం అందిస్తాయి. అదేసమయంలో బ్యాంకు రుణాలు పొందని రైతులు బీమా పథకం కోరుకుంటే సంబంధిత కంపెనీకి వారు నిర్దేశిత ప్రీమియంను చెల్లించాలి. వ్యవసాయశాఖ అధికారుల ద్వారా ఆ సమాచారాన్ని పొంది ప్రీమియం చెల్లించవచ్చు.

ఫార్మర్‌ రిజిస్ర్టీ నంబర్‌ తప్పనిసరి

బీమా కోరుకునే రైతులకు విధిగా విశిష్ట గుర్తింపు సంఖ్య ఉండాలి. ఫార్మర్‌ రిజిస్ట్రీ పేరుతో ఇటీవల ప్రతి రైతుకూ ఒక విశిష్ట సంఖ్యను వ్యవసాయశాఖ కేటాయించింది. ఆ సంఖ్య ఉన్న రైతులకు మాత్రమే బీమా పథకం వర్తిస్తుంది. ఇదిలా ఉండగా ఖరీఫ్‌ సీజన్‌లో పీఎం ఫసల్‌ బీమా కింద ఎంపికైన పంటలలో బీమా ప్రీమియం చెల్లింపునకు వరికి ఆగస్టు 15 వరకు, ఇతర పంటలకు జూలై 31 వరకు గడువు ఉంది. అలాగే రబీ సీజన్‌లో వరికి డిసెంబరు 31 వరకు, ఇతర పంటలకు డిసెంబరు 15 వరకు గడువు ఇచ్చారు. ఇక వాతావరణ ఆధారిత పంటల జాబితాలో ఉన్న పత్తి పంటకు ఖరీఫ్‌ సీజన్‌లో జూలై 15 వరకు, రబీ సీజన్‌లో డిసెంబరు 15 వరకు ప్రీమియం చెల్లింపునకు అవకాశం ఉంది.

Updated Date - Jul 11 , 2026 | 03:06 AM