‘సర్’ వేగవంతం
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:04 AM
జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)ను వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక దృష్టి సారించారు.
మండలాలకు ప్రత్యేక అధికారులు
మరో నాలుగు రోజులే గడువు
జిల్లాలో 78శాతం ప్రక్రియ పూర్తి
22 పోలింగ్ కేంద్రాల్లో నూరుశాతం
ఒంగోలు కలెక్టరేట్, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)ను వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 13,99,006 మంది ఓటర్లు ఉండగా శుక్రవారం సాయంత్రానికి 10,76,874 (78.46 శాతం)మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫాంలను డిజిటలైజేషన్ చేశారు. ఇంకా 3,01,375 మందివి పూర్తిచేయాల్సి ఉంది. జిల్లాలో అత్యధికంగా కందుకూరు నియోజకవర్గంలో 82శాతం పూర్తయింది. అక్కడ 2,28,940 మంది ఓటర్లు ఉండగా 1,83,625 మంది ఫాంలను డిజిటలైజేషన్ చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో 75.01శాతం, సంతనూతలపాడు 77.28శాతం, అద్దంకి 78.00శాతం, కొండపి 78.43శా తం, దర్శి 80.15శాతం పూర్తయింది. 22 పోలింగ్ కేంద్రాల్లో నూరుశాతం అయ్యింది. మిగిలిన వాటిపై కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే మండలాలకు స్పెషల్ ఆఫీసర్లు ఉండగా వారందరినీ ఆయా మండలాల్లో సాగుతున్న ప్రక్రియను పర్యవేక్షించి సకాలంలో పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదనుగుణంగా స్పెషల్ ఆఫీసర్లు వారివారి మండలాలకు తరలివెళ్లారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈలోపు నూరుశాతం ప్రక్రియను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.