Share News

స్పీడుగా ‘సర్‌’

ABN , Publish Date - Jul 12 , 2026 | 02:04 AM

జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ వేగవంత మైంది. ఈనెల 14వతేదీతో గడువు ముగియనుండటంతో తదనుగుణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ రాజాబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం మొత్తం డిజిటలైజేషన్‌ ప్రక్రియను పర్యవేక్షి స్తోంది.

స్పీడుగా ‘సర్‌’

గడువు సమీపిస్తుండటంతో వేగవంతం

అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సహాయకుల ఏర్పాటు

నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం

65 పోలింగ్‌ కేంద్రాల్లో నూరుశాతం పూర్తి

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ వేగవంత మైంది. ఈనెల 14వతేదీతో గడువు ముగియనుండటంతో తదనుగుణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ రాజాబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం మొత్తం డిజిటలైజేషన్‌ ప్రక్రియను పర్యవేక్షి స్తోంది. భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో గతనెల 15వ తేదీన సర్‌ కార్యక్రమం ప్రారంభమైంది. బూత్‌లెవల్‌ అధికారులు(బీఎల్వోలు) ముందుగా ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫాంలను ఇచ్చారు. వాటిని ఓటర్లు పూర్తిచేసి సంబంధిత ఆధారాలతో బీఎల్వోలకు ఇస్తే డిజిటలైజేషన్‌ చేయాల్సి ఉంది. జిల్లాలో 13.99 లక్షల మంది ఓటర్లు ఉండగా ప్రారంభంలో డిజిటలైజేషన్‌ ప్రక్రియలో జాప్యం జరిగింది. ఆతర్వాత కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లాలోని 1,649 పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్వోలు వేగవంతం చేశారు. వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎన్యుమరేషన్‌ ఫాంలను పూరించేందుకు సహాయకులను కూడా ఏర్పాటు చేశారు. అలా జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం 4 గంటలకు 11,40,295 (83.93శాతం) మంది ఓటర్ల ఫాంలను డిజిటలైజేషన్‌ చేశారు. జిల్లాలో 65 పోలింగ్‌ కేంద్రాల్లో నూరుశాతం ప్రక్రియను పూర్తిచేయగా మరికొన్ని చోట్ల 90శాతం అయ్యింది. మరోవైపు జిల్లా అధికారులు మండలాలకు స్పెషలాఫీసర్లుగా ఉండగా వారిని కూడా ఇందులో భాగస్వామ్యులు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారిని ఒంగోలు నియోజకవర్గానికి నోడల్‌ ఆఫీసర్‌గా నియమించగా ఆమె కూడా నిరంతరం ఆయా పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయడంతోపాటు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఒంగోలులో పలు పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్వోలకు ఓటర్లు అవసరమైన ఆధారాలతో ఎన్యుమరేషన్‌ ఫాంలు ఇచ్చి డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తిచేయించుకున్నారు.

Updated Date - Jul 12 , 2026 | 02:04 AM