Share News

ముమ్మరంగా ‘సర్‌’

ABN , Publish Date - Sep 02 , 2026 | 02:45 AM

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అందులో భాగంగా జారీ చేసిన నోటీసులకు ఓటర్లు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,709 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వాటి పరిధిలో సరైన పత్రాలు లేవని 1,96,341 మందికి బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్వోలు) నోటీసులు ఇచ్చారు.

ముమ్మరంగా ‘సర్‌’

నోటీసులకు ఆధారాలు ఇస్తున్న ఓటర్లు

54శాతం ప్రక్రియ పూర్తి

గడువు పొడిగించిన ఎన్నికల సంఘం

వచ్చేనెల 9న తుది జాబితా ప్రచురణ

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అందులో భాగంగా జారీ చేసిన నోటీసులకు ఓటర్లు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,709 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వాటి పరిధిలో సరైన పత్రాలు లేవని 1,96,341 మందికి బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్వోలు) నోటీసులు ఇచ్చారు. వాటిని అందుకున్న వారిలో ఇప్పటి వరకు 1,06,361 మంది సంబంధిత ధ్రువీకరణ పత్రాలను బీఎల్వోలకు అందజేశారు. మరో 89,980 మంది ఇంకా ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటికే 205 పోలింగ్‌ కేంద్రాల్లో నూర ుశాతం ప్రక్రియ పూర్తికాగా 1,504 పోలింగ్‌ కేంద్రాల్లో కొనసాగుతోంది. మరో వారంరోజులు ఈ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 54.17శాతం పూర్తికాగా మిగిలినదాన్ని కూడా గడువులోపు పూర్తిచేసేలా చర్యలు చేపట్టారు. ఒంగోలుతోపాటు ఎక్కువగా నోటీసులు జారీచేసిన నియోజకవర్గాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన గడువులోపు ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించే విధంగా బీఎల్వోలకు పలు సూచనలు చేశారు. నోటీసులు జారీచేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారాన్ని కూడా చేపట్టారు. అయితే నోటీసు అందుకున్న ఓటరు అందుబాటులో లేకపోయినా వీడియో కాల్‌ ద్వారా వారితో మాట్లాడి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తీసుకుంటున్నారు.

గడువు పొడిగించిన ఎన్నికల సంఘం

‘సర్‌’ గడువును పెంచుతూ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితాల అభ్యంతరాలు, క్లైయిమ్‌ల స్వీకరణకు ఈనెల 10వతేదీ వరకు అవకాశం ఇచ్చారు. అక్టోబరు 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఓటర్ల జాబితా సవరణ గడువు పెంపుపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

Updated Date - Sep 02 , 2026 | 02:45 AM