Share News

ముగిసిన ‘సర్‌’

ABN , Publish Date - Jul 25 , 2026 | 02:33 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 13,99,006 మంది ఓటర్లు ఉండగా 12,72,367 మంది డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తిచేసుకున్నారు.

ముగిసిన ‘సర్‌’

ఆరు నియోజకవర్గాల్లో 12.74 లక్షల మంది ఓటర్లు

మ్యాపింగ్‌ చేసుకోని వారు 30వేల మంది

డూప్లికేట్‌ ఓట్లను గుర్తిస్తున్న కంప్యూటర్‌

జిల్లాలో 76 పోలింగ్‌ కేంద్రాలు పెరుగుదల

31న ముసాయిదా జాబితా ప్రచురణ

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 13,99,006 మంది ఓటర్లు ఉండగా 12,72,367 మంది డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తిచేసుకున్నారు. మరో 30,723 మంది తమ ఓట్లను మ్యాపింగ్‌ చేసుకోలేదు. జిల్లాలో అన్‌కలెక్టబుల్‌ కింద 1,26,639 ఓట్లు ఉన్నాయి. అందులో డెత్‌లు 41,419, డబుల్‌ ఎంట్రీలు 14,943, పర్మినెంట్‌గా షిఫ్టింగ్‌ 23,735 ఉండగా డిజిటలైజేషన్‌ ఫాంలు ఇవ్వని ఓటర్లు 46,222, ఇతరులు 320మంది ఉన్నారు. మృతి చెందిన ఓటర్లలో అత్యధికంగా 10,211మంది అద్దంకి నియోజకవర్గంలో ఉండగా, కొండపి నియోజకవర్గంలో 6,949 మంది, దర్శి 6,430, కందుకూరు 6002, ఎస్‌ఎన్‌పాడు 5,764 మంది, ఒంగోలు నియోజకవర్గంలో 5,381 మంది ఉన్నారు. పర్మినెంట్‌గా షిఫ్టింగ్‌ అయిన ఓటర్లు అద్దంకి నియోజకవర్గంలో 5,229 మంది, ఒంగోలులో 4,538, కొండపిలో 4,325 మంది, ఎస్‌ఎన్‌పాడులో 4,157, కందుకూరులో 2,631 మంది, దర్శిలో 2,145 మంది ఉన్నట్లు తేలింది. ఇతర ప్రాంతాల్లో ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకున్న ఓటర్లు అద్దంకి నియోజకవర్గంలో 2,710 మంది, కొండపి 2,514 మంది, దర్శి 2,380 మంది, ఎస్‌ఎన్‌పాడు 2,196మంది, ఒంగోలు 2,174మంది ఉన్నారు. ఈనెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాలో పూర్తిస్థాయిలో ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉండేది తేలనుంది.

రెండేసి ఓట్లు ఉన్న ఓటర్ల గుర్తింపు

సర్‌ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకొని డిజిటలైజేషన్‌ ప్రక్రియను చేపట్టినప్పటికీ జిల్లాలో కొందరు డబుల్‌ ఎంట్రీ (రెండు చోట్ల ఓట్లు) నమోదు చేసుకున్నారు. ఎస్‌ఎన్‌పాడుకు చెందిన ఒక మహిళ పుట్టిన గ్రామంలో తల్లిపేరుతో మ్యాపింగ్‌ చేసుకోగా, వివాహమై భర్త నియోజకవర్గమైన కొండపిలో భర్త పేరుతో మ్యాపింగ్‌ చేసుకోవడంతో రెండు చోట్లా ఓటు నమోదైంది. మరో మహిళ తన స్వగ్రామమైన గుడివాడలో తల్లిపేరుతో ఓటును మ్యాపింగ్‌ చేసుకోగా జిల్లాకేంద్రమైన ఒంగోలులో భర్త పేరుతో ఓటును పొందారు. ఇలా రెండు చోట్లా ఓట్లు పొందిన వారి వివరాలను కంప్యూటర్‌ ద్వారా గుర్తించే పనిలో బీఎల్వోలు నిమగ్నమయ్యారు. రెండు చోట్లా ఇచ్చిన ఫొటోలను కంప్యూటర్‌లో ముఖం ద్వారా గుర్తించి సంబంధిత బీఎల్వోలకు ఒంగోలు నుంచి సమాచారం ఇచ్చారు. ఇలా జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో డబుల్‌ ఎంట్రీ ఓట్లు ఉన్నట్లు సమాచారం. బీఎల్వోలు ఈ సమాచారం ఆధారంగా సంబంధిత ఓటర్లతో రెండు ఓట్లను ఏవిధంగా నమోదు చేసుకున్నారనే విషయాన్ని తెలుసుకోవడమే కాకుండా అందుకు సంబంధించి డిజిటలైజేషన్‌లో ఓటర్లు సంతకం చేసిన దరఖాస్తులను కూడా తెప్పించారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా ఉండటంతో ఎన్నికల అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది.

పెరిగిన పోలింగ్‌ కేంద్రాలు

జిల్లాలో ప్రస్తుతం 1,649 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా మరో 76 పెరిగాయి. వాటితో కలిపి ప్రస్తుతం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 1,725కు చేరింది. కందుకూరు నియోజకవర్గంలో అత్యధికంగా 22 కేంద్రాలు, అద్దంకి నియోజకవర్గంలో 16, ఒంగోలు నియోజకవర్గంలో 12, సంతనూతలపాడు నియోజకవర్గంలో 9, దర్శి నియోజకవర్గంలో 9, కొండపి నియోజకవర్గంలో 8 పోలింగ్‌ కేంద్రాలు పెరిగాయి.

Updated Date - Jul 25 , 2026 | 02:33 AM