ఆందోళనకు గురిచేస్తున్న ‘సర్’
ABN , Publish Date - Aug 20 , 2026 | 02:14 AM
ఓటర్ల సమగ్ర సవరణ (సర్) ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఓటర్లకు జారీ చేస్తున్న నోటీ సుల్లో అనేక అసంబద్ధాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి వారి స్వగ్రా మం ఎక్కడ ఉందో కూడా తెలియదు. వారు పుట్టకముందే తల్లిదండ్రులు మరొక చోట స్థిరపడిపోయారు.
అసంబద్ధమైన వివరాలతో నోటీసులు
2002 ఆధారాలు కావాల్సి రావడంలో అయోమయం
కొందరు ఓటర్లకు వారి స్వగ్రామాలే గుర్తు లేని పరిస్థితి
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల సమగ్ర సవరణ (సర్) ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఓటర్లకు జారీ చేస్తున్న నోటీ సుల్లో అనేక అసంబద్ధాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి వారి స్వగ్రా మం ఎక్కడ ఉందో కూడా తెలియదు. వారు పుట్టకముందే తల్లిదండ్రులు మరొక చోట స్థిరపడిపోయారు. ఇప్పుడు 2002 నాటి ఆధారాలు చూపిం చాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. మరికొంత మంది తమ ఓటు హక్కును పొందేందుకు ధ్రువీకరణ పత్రాలు ఏమి ఇవ్వాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 1,725 పోలింగ్ కేంద్రాల పరిధిలో 12,71,977 మంది ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియలో 1,96,339 మంది పేర్లలో తప్పులతోపాటు 2002 నాటికి సంబంధించి వివరాలు సమగ్రంగా లేకపోవడంతో అటువంటి వారికి ప్రస్తుతం నోటీసులు ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,53,066 మంది ఓటర్లకు నోటీసులు అందాయి. ఇంకా 43,273 మంది ఓటర్లకు ఇవ్వాల్సి ఉంది. అయితే నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు కేటా యించిన తేదీల్లో స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో వచ్చి అందజేయాల్సి ఉంది. ఆ ప్రకారం తమ వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలను తీసుకొని వెళ్తున్న వారిని 2002లో వారి పూర్వీకుల ఓట్ల వివరాలను కూడా అడుగుతుం డటంతో ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
అప్పటి తప్పులతో ఇప్పుడు తిప్పలు
గతంలో రూపొందించిన జాబితాలో అప్పట్లో పనిచేసిన ఉద్యోగులు, సిబ్బంది నిర్వాకం వల్ల ఇప్పుడు ఓటర్లు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో పేరు నమోదు చేసే ప్రక్రియలో కొంతమందికి ఇంటి పేరు ముందుపెట్టడం, మరికొందరికి అక్షరదోషాలు, ఇంకొంతమందికి భర్త స్థానంలో తండ్రి పేరు ముద్రించడం వంటి కారణాలను చూపుతూ ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. గతంలో ఓటు నమోదు సమయంలో సరైన అవగాహన లేకపోవడంతో ఇష్టం వచ్చిన తేదీని పుట్టినరోజుగా నమోదు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వారి వద్ద ధ్రువీకరణ పత్రాల్లో మరో విధంగా పుట్టిన తేదీ ఉండటం వల్ల కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘం సరిచేసేందుకు సర్ ప్రక్రియను చేపట్టగా ఓటర్లకు ఇబ్బందికరంగా మారింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటికే సంబంధిత అధికారులకు సుమారు 15,486 మంది ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అంటే నోటీసులు అందుకున్న ఓటర్లలో కేవలం పదిశాతం లోపు మాత్రమే తిరిగి ఇచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.