షోకాజ్ కొరడా
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:37 AM
జిల్లాలో ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17మంది డిప్యూటీ ఎంపీడీవోలు, 117 మంది పంచాయతీ కార్యదర్శులకు డీపీవో మంగళవారం షోకాజ్ నోటీసులు జారీచేశారు.
ఇంటి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంపై అధికారుల ఆగ్రహం
17మంది డిప్యూటీ ఎంపీడీవోలు, 117మంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు
మూడు రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వకపోతే చర్యలు
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17మంది డిప్యూటీ ఎంపీడీవోలు, 117 మంది పంచాయతీ కార్యదర్శులకు డీపీవో మంగళవారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరం పాత బకాయిలతోపాటు 2025-26కి సంబంధించిన పన్ను వసూళ్లకు సంబంధించి వీటిని ఇచ్చారు. పంచాయతీ రాజ్‌శాఖ కమిషనర్ ఇంటి పన్నుల వసూళ్లపై ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. ఇంటి యజమానుల ద్వారానే ఆన్‌లైన్‌లో పేమెంట్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా పంచాయతీల్లో బకాయిలను అనుగుణంగా నెలవారీ లక్ష్యాలను నిర్దేశించి వసూళ్లకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే జిల్లాలోని 117 పంచాయతీల కార్యదర్శులు ఇచ్చిన లక్ష్యం మేరకు వసూళ్లు చేయకపోవంతో పాటు కొన్ని పంచాయతీల్లో కనీసం ప్రారంభించలేదు. మరోవైపు నిరంతరం ఇంటి పన్నుల వసూళ్లను పర్యవేక్షించాల్సిన 17మంది డిప్యూటీ ఎంపీడీవోలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు అందుకున్న మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని డీపీవో వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మిగిలిన పంచాయతీల్లో కూడా ఈనెల 17వతేదీలోపు ఇచ్చిన లక్షాల్లో పురోగతి సాధించకపోతే చర్యలు తప్పవని డీపీవో స్పష్టం చేశారు.