రెవెన్యూలో అధికారులు, సిబ్బంది కొరత
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:44 PM
ప్రభుత్వ శాఖల్లో కీలకమైన వాటిల్లో రెవెన్యూశాఖ ఒకటి. ప్రజలు నిత్యం ఏదో ఒక సమస్యపై రెవెన్యూ కార్యాలయాలకు వెళుతుంటారు.
ఎక్కువశాతం డిప్యుటేషన్‌లపైనే
మూడు మండలాల్లో లేని రీ సర్వే డీటీలు
సకాలంలో సేవలు అందక ప్రజలకు ఇక్కట్లు
మార్కాపురంటౌన్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ శాఖల్లో కీలకమైన వాటిల్లో రెవెన్యూశాఖ ఒకటి. ప్రజలు నిత్యం ఏదో ఒక సమస్యపై రెవెన్యూ కార్యాలయాలకు వెళుతుంటారు. ప్రధానంగా భూసంబంధ సేవలు, పింఛన్లు, ప్రకృతి వైపరీత్యాల సహాయం, రేషన్ కార్డులు, ఆపద్బంధు పథకం, జనన, మరణ, ఆదాయ, నివాస తదితర ధ్రువీకరణ పత్రాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, పౌరసరఫరాలు, మీ సేవ ద్వారా అందే మరో 30 రకాలైన సేవలు రెవెన్యూ కార్యాలయాల్లోనే అందుతాయి. అంతటి కీలకమైన శాఖలో మార్కాపురం నియోజకవర్గ పరిధిలో అఽధికారులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నాలుగు మాసాల క్రితమే మార్కాపురం నూతన జిల్లాగా ఏర్పడడంతో కలెక్టర్ కార్యాలయానికి కొంతమందిని డిప్యుటేషన్‌పై కేటాయించారు. దీంతో ఆయా మండలాల రెవెన్యూ కార్యాలయాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికారులు, సిబ్బంది కొరతను తీర్చితేనే ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వీలుకలగనుంది.
మూడుచోట్ల లేని రీ సర్వే డీటీలు
భూ సమస్యల్లో ఎక్కువగా సర్వేకు సంబంధించినవే అధికం. రీసర్వే కార్యక్రమం ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి గతంలో ప్రతి మండలానికి ఒక రీ సర్వే డీటీని నియమించారు. కానీ రెగ్యులర్ డీటీ పోస్టుల కొరత ఉండటంతో వారందరినీ మళ్లీ వెనక్కి పంపారు. మార్కాపురం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో రీ సర్వే జరుగుతోంది. కానీ అత్యంత కీలకమైన రీసర్వే డీటీ పోస్టులు మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల్లో ఖాళీగా ఉన్నాయి. ఒక్క పొదిలిలో మాత్రమే రీ సర్వే డీటీ విధుల్లో ఉన్నారు.
కలెక్టరేట్‌కు పెరుగుతున్న రెవెన్యూ సమస్యలు
మండలాల్లో అధికారుల, సిబ్బంది కొరత నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే మీ కోసం(పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి రెవెన్యూ సమస్యలపై అధికంగా అర్జీలు వస్తున్నాయి. ఆయా సచివాలయాలు, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో సక్రమంగా పనులు కాకపోవడంతో ప్రజలు వారి గోడు వెళ్లబోసుకునేందుకు కలెక్టరేట్‌కు వస్తున్నారు. మీ కోసం కార్యక్రమంలో 90 శాతం రెవెన్యూ సమస్యలపైనే ప్రజలు అర్జీలు అందజేస్తున్నారు. కలెక్టరేట్‌కు వచ్చిన సమస్యలను మళ్లీ తిప్ప మండల రెవెన్యూ కార్యాలయాలకు పంపుతున్నా అవి పరిష్కారానికి నోచుకోవడానికి చాలా సమయం పడుతోంది.
పొదిలి మినహా అన్నిచోట్లా ఇబ్బందులే...
మార్కాపురం నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండల రెవెన్యూ కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో పొదిలిలో మాత్రమే తగినంత మంది అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు.
ముఖ్యంగా తర్లుపాడు మండలంలో పరిస్థితి తీవ్రఇబ్బందిగా ఉంది. అక్కడ తహసీల్దార్ మినహా కీలకమైన డీటీలు, ఆర్‌ఐల పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మూడు గ్రామాల్లో వీఆర్వోలు లేకపోవడంతో ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు.
కొనకనమిట్ల మండలంలో డీటీ, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగు చోట్ల వీఆర్వోల పోస్టులు కూడా ఖాళీ కావడంతో ఇన్‌చార్జీలను నియమించారు.
మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్, రీ సర్వే డీటీ, ఒక గ్రామంలో వీఆర్వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.