Share News

సాగుకు ముందే షాక్‌

ABN , Publish Date - Jun 11 , 2026 | 03:01 AM

ఈ ఏడాది పంటల సాగుకు ముందే రైతులకు షాక్‌ తగిలింది. సాగులో అధికంగా వాడే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. గత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి కంపెనీలు ఎడాపెడా బాదేస్తున్నాయి.

సాగుకు ముందే షాక్‌

భారీగా పెరిగిన ఎరువుల ధరలు

ఖరీఫ్‌ సీజన్‌కు కష్టాలు

రూ.30కోట్లకుపైగా భారం

బస్తాకు సగటున రూ.400 పెరుగుదల

యూరియా, డీఏపీలపై సబ్సిడీ కొనసాగింపుతో ఊరట

అమలులోకి వచ్చిన యాప్‌లో ఎరువుల విక్రయాలు

ఒంగోలు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది పంటల సాగుకు ముందే రైతులకు షాక్‌ తగిలింది. సాగులో అధికంగా వాడే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. గత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి కంపెనీలు ఎడాపెడా బాదేస్తున్నాయి. ఏకంగా మూడుసార్లు ధరలను పెంచాయి. తాజాగా మరోసారి పెంచి కర్షకులను మరిన్ని కష్టాల్లోకి నెట్టాయి. దీంతో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ ఎరువుల వాడకంపైనే సుమారు రూ.30 కోట్లకుపైగా రైతులపై భారం పడనుంది. జిల్లాలో ఖరీఫ్‌ కంటే రబీలో అధికంగా పంటలు సాగు చేస్తారు. ఆ ప్రకారం చూస్తే భవిష్యత్‌లో ధరలు పెరగకుండా ప్రస్తుత ధరలే కొనసాగినా రబీ సీజన్‌కు వాడే ఎరువులపై మరో రూ.50 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో లక్షా 81వేల ఎకరాలల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. వాటికి 57,458 టన్నుల వివిధ రకాల ఎరువులు వినియోగిస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో 16,199 టన్నుల యూరియా, 7,585 టన్నుల డీఏపీ ఉంది. అలాగే 29,880 టన్నులు వివిధ రకాల కాంప్లెక్స్‌ ఎరువులు, మరో 2,843 టన్నుల సూపర్‌ ఫాస్పేట్‌, 951 టన్నుల పొటాష్‌ వాడకం ఉంటుంది. వరికి అధికంగా వాడే యూరియాతోపాటు డీఏపీపై కేంద్రం సబ్సిడీ కొనసాగిస్తోంది. దీంతో వాటి ధరలు పెరగలేదు. ప్రస్తుతం బస్తా యూరియా ధర రూ.266, డీఏపీ ధర రూ.1,350 ఉండగా అవే ధరలు అమలుకానున్నాయి. ఈ రెండింటి ధరలు పెరగకపోవడం రైతులకు కొంతమేర ఊరటగానే చెప్పాలి. అదే సమయంలో వివిధ రకాల వ్యాపార, వాణిజ్య పంటలకు వాడే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. జిల్లాలో ఆ ఎరువులు వాడకమే అధికంగా ఉంటాయి.

కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం అధికం

మొత్తం ఖరీఫ్‌ సీజన్‌లో వినియోగించే వాటిలో 52శాతంపైగా కాంప్లెక్స్‌ మరో 7శాతం వరకు పొటాష్‌, పాస్ఫేట్‌ కలిపి ఇంచుమించు 60శాతం ఎరువులు ఉంటాయి. ప్రస్తుతం వాటన్నింటి ధరలు పెరిగాయి. సుమారు ఏడెనిమిది రకాల కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం జిల్లాలో ఉంటుండగా వాటిపై బస్తాకు రూ.300 నుంచి రూ.700 వరకు పెరిగాయి. సగటున ఒక్కో బస్తాకు రూ 400 వరకు పెరుగుదల వేసుకున్నా ఖరీఫ్‌ సీజన్‌కు జిల్లాలో వాడకం జరిగే సుమారు 21వేల మెట్రిక్‌ టన్నులపైనే. దీంతో దాదాపు రూ.24 కోట్ల మేర రైతులపై అదనపుభారం పడనుంది. అలాగే ఇతర ఎరువులు చూస్తే పొటాష్‌, ఫాస్పేట్‌లపై సగటున బస్తాకు రూ.150పైగా పెరుగుదలతో దాదాపు రూ.4.50 కోట్ల మేర భారం పడనుంది. అలా యూరియా, డీఏపీ మినహా ఇతర ఎరువులపై ఒక్క ఖరీఫ్‌ సీజన్‌కే సుమారు రూ.30 కోట్లమేర రైతులు భారం భరించాల్సి వస్తోంది. కాగా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగడంతో రైతులు యూరియా, డీఏపీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఆమేర వాటికి డిమాండ్‌ ఏర్పడనుంది. ఇదిలాఉండగా ఈ సీజన్‌ నుంచి ఎరువుల నియంత్రణపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. అందుకోసం యాప్‌ ద్వారా విక్రయాలు ప్రారంభించింది. తద్వారా సాగు చేసే రైతులకే ఎరువులు ఇచ్చి ఎరువులు బ్లాక్‌ మార్కెటింగ్‌ను నిరోధించనున్నారు. అయితే ప్రభుత్వ చర్యలు ఏ మేరకు సఫలం అన్నది చూడాల్సి ఉంది. కాగా ఎరువులు ప్రస్తుత, పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి

ఎరువు పాతధర(బస్తారూ) కొత్తధర(బస్తా రూ.)

20-20-0-13 1,450 2,150

16-20-0-13 1,400 1,750

10-26-26 1,950 2,250

16-16-16 1,675 2,050

24-24-0 2,000 2,300

15-15-15 1,650 1,950

సూపర్‌పాస్పెట్‌ 615 775

పొటాష్‌ 1850 1975

Updated Date - Jun 11 , 2026 | 03:05 AM