షాడో పెత్తనం
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:11 AM
కొనకనమిట్ల మండలంలో విద్యాశాఖపై ఓ ఉపా ధ్యాయుడు పెత్తనం చేస్తున్నారు. ఆయన చెప్తే నే పనులు జరుగుతున్నాయి. అక్కడ మండల విద్యావనరుల కేంద్రంలో ఉండాల్సిన ఉపాధ్యా యులకు సంబంధించిన రికార్డులన్నీ చాలాకాలంగా సదరు ఉపాధ్యాయుడి ఆధీనంలో పొదిలిలో ఉండటం నివ్వెరపరుస్తోంది.
అక్కడ ఆ ఉపాధ్యాయుడిదే హవా
ఎమ్మార్సీలో ఉండాల్సిన ఫైళ్లు అతని వద్దే
పొదిలిలో కొనకనమిట్ల రికార్డులు
ఇబ్బందులు పడుతున్నామంటున్న ఉపాధ్యాయులు
మార్కాపురం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : కొనకనమిట్ల మండలంలో విద్యాశాఖపై ఓ ఉపా ధ్యాయుడు పెత్తనం చేస్తున్నారు. ఆయన చెప్తే నే పనులు జరుగుతున్నాయి. అక్కడ మండల విద్యావనరుల కేంద్రంలో ఉండాల్సిన ఉపాధ్యా యులకు సంబంధించిన రికార్డులన్నీ చాలాకాలంగా సదరు ఉపాధ్యాయుడి ఆధీనంలో పొదిలిలో ఉండటం నివ్వెరపరుస్తోంది. దీన్ని బట్టి ఆయన హవా ఏస్థాయిలో సాగుతుందో అర్థమవుతుంది. జిల్లాలోని కొనకనమిట్ల మండలంలో ఇద్దరు ఎంఈవోలు ఉన్నారు. విద్యాశాఖకు సంబంధించిన కార్యకలాపాలన్నీ వీరిద్దరి ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. కానీ అధికారిక కార్యక్రమాలన్నీ అదే మండలంలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుని కనుసన్నల్లో నడుస్తున్నట్లు కొందరు టీచర్లు ఫిర్యాదు చేస్తున్నారు. మండల కార్యాలయంలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సర్వీసు రికార్డులన్నీ అతని ఆధీనంలో పొదిలిలోని ఒక కార్యాలయంలో ఉంచినట్టు చెబుతున్నారు. ఉపాధ్యాయుల బెనిఫిట్స్‌కు సంబంధించిన వివరాలు, సర్వీస్ విషయాలు రికార్డుల్లో నమోదు చేయాలన్నా అన్నింటికీ అతనివద్దకే పొదిలి వెళ్లాల్సి రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కార్యాలయానికి సంబంధించిన నిధి, సీఎఫ్‌ఎంఎస్, ఈహెచ్‌ఎస్ లాగిన్‌లు కూడా ఈ ఉపాధ్యాయుని స్వాధీనంలోనే ఉంటున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. మండల కేంద్రంలోని కార్యాలయంలో సరిపడినంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ ఇతని పెత్తనం కింద పనులు ఎందుకు చేయిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇదే విషయం ఇటీవల జిల్లా విద్యాశాఖ అఽధికారి దృష్టికి తీసుకెళ్లగా రికార్డులను పొదిలి నుంచి కొనకనమిట్లకు తరలించినట్లు తెలిసింది. మిగిలిన విషయాల్లో కూడా ఆ షాడో అధికారి పెత్తనం నుంచి విముక్తి కల్పించాలని పలువురు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.