నియోజకవర్గానికి ఏడు ట్రాక్టర్లు
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:49 AM
ప్రభుత్వ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులైన రైతులను ఎంపిక చేసి నెలాఖరులోపు వ్యవసాయ యంత్ర పరికరాలను అందించనున్నట్లు జిల్లా వ్యవ సాయ అధికారి (డీఏవో) ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి ఏడు ట్రాక్టర్లు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నెలాఖరులోపు రైతులకు అన్నిరకాల వ్యవసాయ యంత్రాలు అందజేత
కేటగిరీవారీ కేటాయింపులకు సరిపడా దరఖాస్తులు రాకనే జాప్యం
తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల గుర్తింపు
డీఏవో శ్రీనివాసరావు
ఒంగోలు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులైన రైతులను ఎంపిక చేసి నెలాఖరులోపు వ్యవసాయ యంత్ర పరికరాలను అందించనున్నట్లు జిల్లా వ్యవ సాయ అధికారి (డీఏవో) ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి ఏడు ట్రాక్టర్లు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ యంత్ర పరికరాల అందజేతలో నెలకొన్న జాప్యంపై సోమవారం ఆంధ్రజ్యోతిలో ‘యంత్రం జాప్యం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై డీఏవో స్పందించారు. జాప్యం జరిగిన విషయాన్ని అంగీకరిస్తూ అందుకు కారణాలను వివరించారు. గత ఏడాదికి సంబంధించి రూ.4.19 కోట్ల సబ్సిడీతో జిల్లాకు 1,228 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అందులో తొలుత 9 రకాల పరికరాలను కేటాయించిందన్నారు. అప్పటి మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను స్వీకరించగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీల పరిధిలో అందలేదన్నారు. వచ్చిన దరఖాస్తుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించగా సర్దుబాటు చేసి సవరించిన ప్రకారం 1,364 యూనిట్లు కేటాయించారని వాటికి దరఖాస్తులు స్వీకరించగా 4,525 అందాయన్నారు. అందరికీ ఇవ్వాలంటే సుమారు రూ.61.60 కోట్ల సబ్సిడీ మొత్తం అవసరమవుతుందన్నారు. అయితే జిల్లాకు రూ.4.19 కోట్లు కేటాయించారన్న ఆయన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇలాగే భారీ డిమాండ్ వచ్చిందన్నారు. వాటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం యంత్ర పరికరాల పంపిణీపై ఆగస్టు 31న తాజాగా మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. ఎక్కువ మంది లబ్ధిదారులు ట్రాక్టర్లను కోరిన నేపథ్యంలో జిల్లాలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడు చొప్పున కేటాయించారన్నారు. మిగిలిన మొత్తానికి ఇతర పరికరాలు కేటాయించగా ఆ ప్రకారం లబ్ధిదారుల ఎంపిక ప్రస్తుతం జరుగుతుందన్నారు. ప్రక్రియ పూర్తిచేసి నిబంధనల ప్రకారం రైతులను ఎంపిక చేసి నెలాఖరులోపు పరికరాలను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.