పరిశ్రమలను స్థాపించండి
ABN , Publish Date - Jun 23 , 2026 | 01:05 AM
జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమలను స్థాపించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ఎస్‌జీవీఎస్ కన్వెన్షన్ హాలులో సోమవారం రాత్రి ఎలైట్ బిజినెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు.
జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోండి
పారిశ్రామిక వేత్తలకు మంత్రి గొట్టిపాటి పిలుపు
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమలను స్థాపించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ఎస్‌జీవీఎస్ కన్వెన్షన్ హాలులో సోమవారం రాత్రి ఎలైట్ బిజినెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో పారిశ్రామిక రంగానిది కీలకపాత్ర అన్నారు. రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టున్నదని తెలిపారు. ఈ దృష్ట్యా అన్ని జిల్లాల్లోని అవకాశాలను అధికార యంత్రాంగం వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఇలాంటి మీట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లు దామచర్ల జనార్దన్, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి, బీఎన్ విజయకుమార్, ఏలూరి సాంబశివరావు, కందుల నారాయణరెడ్డి, దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, కందుకూరు సబ్‌కలెక్టర్ హిమవంశీ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన సమగ్ర సమాచారంతోపాటు పారిశ్రామిక అవకాశాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను మంత్రి రవికుమార్, కలెక్టర్ రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు ఆవిష్కరించారు.
అవకాశాలను అందిపుచ్చుకోండి
‘జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి శోభను సంతరిం చుకోనుంది. భారీ పెట్టుబడులకు గమ్యస్థానం కానుంది. ఇక్కడి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి’ అని కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవకాశాలను వివరించారు. అనంతరం మాట్లాడుతూ 2025లో జిల్లా తలసరి ఆదాయం 2,17,511గా, స్థూల ఉత్పత్తి రూ.73,331 కోట్లుగా, వృద్ధి రేటు 15.3 శాతంగా ఉందన్నారు. జిల్లాలో రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండోసోల్ కంపెనీలతోపాటు జిందాల్ స్టీల్ కూడా ఐరన్ ఓర్ తవ్వకాల ప్రతిపాదనతో వచ్చిందన్నారు. దొనకొండ మండలంలో 25వేల ఎకరాలతో మెగా ఇండస్ట్రియల్ పార్కు అందుబాటులో ఉందన్నారు. జాతీయ రహదారులు కూడా పెరిగాయన్నారు. ప్రపంచంలో 50శాతం నగరాలు సముద్రతీరం వెంబడే అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ వాస్తవాలను తెలుసుకొని పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రకాశంలో సదస్సు ఏర్పాటు
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారిగా జిల్లాలో పారిశ్రామికవేత్తల సదస్సు ఏర్పాటు చేయడం శుభపరిణామం అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఒంగోలు నగరాన్ని పారిశ్రామిక హబ్‌గా తయారు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. నగరంలో ఇండస్ర్టియల్ మోడల్ టౌన్‌షిప్స్ ఏర్పాటుచేయాలని కోరారు. ఈ సమావేశానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు రూ.20వేల కోట్ల పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్నవారన్నారు. హార్టికల్చర్, పొగాకు కోల్డ్‌స్టోరేజీల నిర్మాణానికి జిల్లాలో మంచి అవకాశాలు ఉన్నాయని మాగుంట తెలిపారు.