సూపర్ బజార్‌పై సెక్షన్ 52 విచారణ
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:40 AM
ఒంగోలు కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ (సూపర్‌బజారు)పై సెక్షన్ 52 విచారణకు జిల్లా సహకారాధికారి డి.శ్రీ లక్ష్మి ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వంలో సూపర్ బజార్ ప్రాంగణంలో హోటల్ నిర్వహణను నిబంధ నలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చినట్లు ఆ సంస్థ 2024-25 సంవత్సరం ఆడిట్ నివేదికలో ఆడిటర్ నివేదించడంతో దానిపై విచారణకు డీసీవో ఆదేశించారు.
విచారణాధికారిగా నాటి ఎండీనే నియమించడంపై విమర్శలు
ఒంగోలు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ (సూపర్‌బజారు)పై సెక్షన్ 52 విచారణకు జిల్లా సహకారాధికారి డి.శ్రీ లక్ష్మి ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వంలో సూపర్ బజార్ ప్రాంగణంలో హోటల్ నిర్వహణను నిబంధ నలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చినట్లు ఆ సంస్థ 2024-25 సంవత్సరం ఆడిట్ నివేదికలో ఆడిటర్ నివేదించడంతో దానిపై విచారణకు డీసీవో ఆదేశించారు. అయితే హోటల్ నిర్వహణకు నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చినట్లు పేర్కొన్న సమయంలో సదరు సంస్థ ఎండీగా పనిచేసిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ బీసీహెచ్ మాలకొండయ్యను తిరిగి విచారణాధికారిగా నియమించడంపై సహకారశాఖ వర్గాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన అంశాలు పరిశీలిస్తే.. 2024-25 సంవత్సరం సూపర్‌బజార్ ఆడిట్ చేసిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.మారుతిబాబు తన నివేదికలో హోటల్ లీజు వ్యవహారాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. గౌస్ హోటల్‌కు సంబంధించిన షోకత్ ఆలీ అనే వ్యక్తికి 2024 మార్చి నుంచి 2027 వరకు మూడేళ్ల పాటు సూపర్ బజారు ప్రాంగణంలో హోటల్ నిర్వహణకు లీజుకు ఇస్తూ నాటి సూపర్‌బజారు చైర్మన్ హోదాలో తాతా బదరీనాథ్ జ్యుడిషియల్ స్టాంప్‌పై లీజు అగ్రిమెంట్ ఇచ్చారు. నెలకు రూ.60వేలు చెల్లించేలా లీజు ఖరారుచేశారు. అయితే సూపర్ బజారు మినిట్స్ పుస్తకంలో తీర్మానం తేదీ కూడా నమోదు సరిలేదని, అంతేకాక సంఘం ఎండీగా ఉన్న అధికారి మాలకొండయ్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆడిట్ అధికారి మారుతిబాబు పేర్కొన్నారు. మరోవైపు సూపర్‌బజారు ప్రాంగణంలో నిబంధనల ప్రకారం ఆ సంస్థ కార్యకలాపాలు తప్ప ఇతర వ్యాపారాలకు ఇవ్వకూడదు. ఈ అంశాలను తన నివేదికలో మారుతిబాబు పేర్కొంటూ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. మరోవైపు సురేంద్రబాబు ఎండీగా ఉన్న సమయంలో తన దుకాణాన్ని బలవంతంగా ఖాళీ చేయించారని గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదుచేయగా దానిపై డీసీవో ఆదేశాలతో సహకారశాఖ ఇనస్పెక్టర్ బాలసుబ్రహ్మణ్యకుమార్ విచారణ చేశారు. ఈ రెండు నివేదికలపై సెక్షన్ 52 విచారణ చేయాలని డీసీవో శ్రీలక్ష్మీ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. అయితే సూపర్‌బజారు ఎండీగా మాలకొండయ్య పనిచేసిన కాలంలోనే నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చారని ఆ ప్రక్రియలో ఎండీగా ఉన్న మాలకొండయ్య తీరు కూడా నిబంధనలకు విరుద్ధంగా సాగిందని ఆడిటర్ నివేదించారు. అయితే ప్రస్తుతం విచారణాధికారిగా అదే మాలకొండయ్యను నియమించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం సహకారశాఖ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది.