నేడు రెండోదశ పల్లెపోరు
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:25 AM
జిల్లాలో రెండో విడత పంచా యతీ ఎన్నికలు ఆదివారం జరుగుతు న్నాయి. అందుకు అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. మూడు విడతల్లో జిల్లాలోని 515 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో తొలివిడత ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లోని 139 పంచాయతీల్లో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి.
అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లో పోలింగ్
123 సర్పంచ్‌లు, 1,017 వార్డు సభ్యులకు ఎన్నికలు
సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం
పోలింగ్ సెంటర్‌లకు చేరిన సిబ్బంది, మెటీరియల్
సగానికిపైగా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తింపు
వెయ్యిమందికిపైగా పోలీసులతో బందోబస్తు
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
మధ్యాహ్నం వరకు పోలింగ్.. ఆవెంటనే కౌంటింగ్
ఒంగోలు, నవంబరు 28 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో రెండో విడత పంచా యతీ ఎన్నికలు ఆదివారం జరుగుతు న్నాయి. అందుకు అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. మూడు విడతల్లో జిల్లాలోని 515 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో తొలివిడత ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లోని 139 పంచాయతీల్లో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. రెండో విడతగా అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని 10 మండలాల్లో ఉన్న పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పరిధిలో మొత్తం 198 గ్రామ పంచాయతీలు వాటిలో 2,014 వార్డులు ఉన్నాయి. నామినేషన్లు ఉపసంహరణలు ముగిసే నాటికి 75 సర్పంచ్ పదవులు, 994 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇక 123 పంచాయతీ సర్పంచ్ పదవులకు, 131 పంచాయతీల్లోని 1,020 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మూడు వార్డులకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో 1,017 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలుత 2,014 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న స్థానాలకు సంబంధించి 1,295 ఉన్నాయి. ఆ పరిధిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆవెంటనే గెలుపొందిన వారితో ప్రమాణస్వీకారాలు కూడా చేయించనున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు శనివారం సాయంత్రానికే సిబ్బంది, మెటీరియల్‌ను చేర్చారు. మండల కేంద్రాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆయా పంచాయతీలకు ప్రత్యేక బస్సుల్లో సిబ్బందిని, మెటీరియల్‌ను పంపించారు. మొత్తం 3,560 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
సమస్యాత్మక గ్రామాలపై నిఘా
నామినేషన్ల సందర్భంగా కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఈ ప్రాంతంలో ఏర్పడ్డాయి. పలుచోట్ల ఘర్షణలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎన్నికలు జరుగుతున్న 1,295 పోలింగ్ కేంద్రాల్లో సాధారణ కేంద్రాలు 630 కాగా 415 సమస్యాత్మక, 250 అత్యంత సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమోరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటుతోపాటు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు వెయ్యి మందికిపైగా పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే 283 మంది రౌడీషీటర్లు అలాగే ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వారిగా గుర్తించిన మరో 567 మందిని బైండోవర్ చేశారు. పోలింగ్ అనంతరం జరిగే కౌంటింగ్ సమయంలోనూ, మొత్తం ప్రక్రియ తర్వాత కూడా కొన్నిచోట్ల ఘర్షణలు జరిగే అవకాశాలు ఉండటంతో అలాంటి గ్రామాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
కలెక్టర్ రాజాబాబు, ఎస్సీ హర్షవర్థన్‌రాజు శనివారం పలు మండలాల్లో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత బల్లికురవలోని మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం సంతమాగులూరు కేంద్రాన్ని సందర్శించిన వారు సాయంత్రం దర్శి నియోజకవర్గంలోని పలు కేంద్రాలకు వెళ్లి అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇదిలాఉండగా పలు పంచాయతీల్లో పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో ఉన్న ఓటర్లతోపాటు ఇతర ప్రాంతాల్లో వివిధ వృత్తులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిపై అభ్యర్థులు దృష్టి సారించారు. స్థానికంగా పలు గ్రామాల్లో ఓట్ల కోసం భారీగా డబ్బులు పంపిణీ చేసిన అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఓట్లకు డబ్బుతోపాటు రానుపోను చార్జీలు ఇవ్వడం, కొన్నిప్రాంతాల నుంచి ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పెద్దసంఖ్యలో వలస ఓటర్లు ఈ ఎన్నికలకు వస్తున్నారు.