రెండో రోజు ఉన్నతాధికారులు
ABN , Publish Date - Apr 18 , 2026 | 01:29 AM
జనగణన-27లో ప్రాథమిక ఘట్టమైన గృహగణన కార్యక్రమంలో రెండో రోజైన శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. స్వీయగణన పేరుతో ఈనెల 16నుంచి 30వతేదీ వరకు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
స్వీయగణనలో నమోదు చేసుకున్న కలెక్టర్, ఎస్పీ
రేపటి నుంచి మహిళా సంఘాల సభ్యులు
ఒంగోలు, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : జనగణన-27లో ప్రాథమిక ఘట్టమైన గృహగణన కార్యక్రమంలో రెండో రోజైన శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. స్వీయగణన పేరుతో ఈనెల 16నుంచి 30వతేదీ వరకు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రజల్లో విస్తృత అవగాహన కోసం ఒక్కో రోజు ఒక్కో విభాగం వారు ఆ వివరాలను నమోదు చేసుకునేలా షెడ్యూల్‌ను రూపొందించింది. స్థానిక జనగణన కార్యక్రమాన్ని ఇన్‌చార్జిలైన అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో చేపట్టగా తొలిరోజైన గురువారం జిల్లాకు చెందిన మంత్రి స్వామితోపాటు పలువురు ఎమ్మెల్యేలు స్వీయగణనను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న విషయం విదితమే. రెండో రోజైన శుక్రవారం కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజులు ఒంగోలు కార్పొరేషన్ ఇన్‌చార్జి కమిషనర్ రాంభూపాల్‌రెడ్డి, ఇతర జనగణన విభాగం సిబ్బంది కుమార్, సుజాతల పర్యవేక్షణలో తమ గృహాల వివరాలను నమోదు చేసుకున్నారు, ప్రతి ఒక్కరూ కుటుంబ వివరాలను ఇలా స్వీయగణనలో నమోదు చేసుకోవాలని వారు సూచించారు. స్వీయగణన కార్యక్రమం ఈనెల 30 వరకు కొనసాగనుంది. ఆదివారం నుంచి మరింత ఊపందుకోనుంది. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం స్వయం సహాయక మహిళా బృందాల సభ్యులు, సోమవారం ఉపాధి శ్రామికులు, మంగళవారం ప్రభుత్వ ఉద్యోగులపైనా జనగణన సిబ్బంది దృష్టిసారించనున్నారు.