Share News

బడి పిలుస్తోంది.. పదండి

ABN , Publish Date - May 13 , 2026 | 03:17 AM

బడి పిలుస్తోంది.. కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే భారీగా ఎన్‌రోల్‌మెంట్‌ నమోదైంది. గతంలో వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై పెద్దగా దృష్టిపెట్టేవారు కాదు.

బడి పిలుస్తోంది.. పదండి
జరుగుమల్లి మండలం పైడిపాడు రెడ్డిపాలెంలో బడిపిలుస్తోంది ర్యాలీ నిర్వహిస్తున్న ఎంఈవో నాగేంద్రవదన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు (ఫైల్‌)

ఎన్‌ రోల్‌మెంట్‌ పెంపునకు స్పెషల్‌ డ్రైవ్‌

సత్ఫలితాలు ఇస్తున్న టీచర్ల ప్రయత్నాలు

ఇప్పటికే 83.34శాతం లక్ష్యం పూర్తి

రాష్ట్రంలో 3వ స్థానంలో ప్రకాశం

ఐదో స్థానంలో నిలిచిన మార్కాపురం

బడి పిలుస్తోంది.. కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే భారీగా ఎన్‌రోల్‌మెంట్‌ నమోదైంది. గతంలో వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై పెద్దగా దృష్టిపెట్టేవారు కాదు. అందుకుభిన్నంగా ఈ ఏడాది సెలవులు ప్రకటించిన రోజు నుంచి క్షేత్రస్థాయి అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటింటికీ తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులను ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు. ఫలితంగా ఇప్పటికే 83.34శాతం ఎన్‌రోల్‌మెంట్‌తో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థుల అడ్మిషన్ల లక్ష్యాన్ని అధిగమించాలన్న కృతనిశ్చయంతో అధికారులు, ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు.

ఒంగోలు విద్య, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలను ప్రోత్సహించేందుకు ‘బడి పిలుస్తోంది’ పేరుతో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే భారీగా పిల్లలను సర్కారు బడులకు పంపేందుకు తల్లిదండ్రులు అంగీకారం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతులకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదిశాతం ఎన్‌రోల్‌మెంట్‌ పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి తరగతిలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్త విద్యార్థులను చేర్పించాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10 తరగతుల్లో 1,04,093 మంది విద్యార్థులు ఉన్నారు. పది శాతం అదనపు టార్గెట్‌ అంటే 10,409 మందిని అదనంగా మొత్తం 1,14,502 మంది విద్యార్థులను ఈ ఏడాది పాఠశాలల్లో నమోదు చేయాలి. ఈ లక్ష్యసాధనలో భాగంగా మంగళవారం నాటికి 95,430 మంది విద్యార్థులను చేర్పించి 83.34శాతం సాధించారు. దీంతో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. ఇంకా లక్ష్యాన్ని చేరుకునేందుకు 19,072 మందిని మాత్రమే పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంది.

5వ స్థానంలో మార్కాపురం జిల్లా

మార్కాపురం జిల్లా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లో రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది. ఇక్కడ 1నుంచి 10 తరగతుల్లో గత ఏడాది 98,159 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 10శాతం అదనంగా అంటే 9,816 మంది కలిపి 1,07,975 మందిని నమోదు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ లక్ష్యసాధనలో ఇప్పటివరకు 89,327 మందిని పాఠశాలల్లో చేర్పించారు. నూరు శాతం లక్ష్యాన్ని సాధించేందుకు మరో 18,648 మందిని చేర్పించాల్సి ఉంది.

ఒకటో తరగతిలో 71.14 శాతం పూర్తి

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో ఇప్పటివరకు 71.14 శాతం లక్ష్యాన్ని సాధించారు. జిల్లాపరిధిలోని 28 మండలాల్లో ఐదు సంవత్సరాల వయస్సు నిండి 1వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన 15,991 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 55 శాతం అంటే 8,795 మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వీరిలో ఇప్పటివరకు 6,257 మందిని పాఠశాలల్లో చేర్పించి 71.44శాతాన్ని పూర్తిచేశారు. ఇంకా 2,538 మందిని పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంది. జరుగుమల్లి మండలంలో అత్యధికంగా 134 శాతం లక్ష్యాన్ని అధిగమించి ప్రథమ స్థానంలో నిలిచింది. జె.పంగులూరు 122శాతం, బల్లికురవ 115శాతం, ముండ్లమూరు 108 శాతం, మర్రిపూడి 106 శాతం, వీవీపాలెం 100శాతం ఎన్‌రోల్‌మెంట్‌ లక్ష్యాలను పూర్తిచేశారు. ఒంగోలు అర్బన్‌, రూరల్‌, కందుకూరు మండలాలు వెనుకబడి ఉన్నాయి.

మార్కాపురంలో 77శాతం

1వ తరగతి ప్రవేశాల్లో ప్రకాశం కంటే మార్కాపురం జిల్లా ముందంజలో ఉంది. ఈ జిల్లాలో ఇప్పటికే 77.63 శాతం ప్రవేశాలు పూర్తయ్యాయి. జిల్లాలో ఐదేళ్లు పూర్తయిన వారు 12,284 మంది ఉండగా వీరిలో 55శాతం అంటే 6,756 మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వీరిలో ఇప్పటివరకు 5,245 మందిని పాఠశాలల్లో చేర్పించారు. ఇంకా 1,511 మందిని పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంది. విద్యార్థుల నమోదులో 141.67 శాతం మందితో హనుమంతునిపాడు మండలం ప్రథమస్థానంలో నిలిచింది. పీసీపల్లి 131.39 శాతం, పెద్దారవీడు 103.13 శాతం, తర్లుపాడు 101.36శాతం, దోర్నాల 99.16శాతం, నమోదుతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. గిద్దలూరు మండలంలో అతి తక్కువగా కేవలం 51శాతం మందిని మాత్రమే 1వ తరగతిలో చేర్పించారు.

Updated Date - May 13 , 2026 | 03:17 AM