పనిసర్దుబాటుకు షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:12 AM
ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మునిసిపల్ యాజమాన్య పాఠశాలల్లో మిగులుగా తేలిన ఉపాధ్యాయులను అవసరం ఉన్న బడులకు సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 20వతేదీ నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా మిగులు టీచర్లను గుర్తించాలి.
నేడు మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాలు
రేపు మండల స్థాయిలో కౌన్సెలింగ్
ఒంగోలు విద్య, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మునిసిపల్ యాజమాన్య పాఠశాలల్లో మిగులుగా తేలిన ఉపాధ్యాయులను అవసరం ఉన్న బడులకు సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 20వతేదీ నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా మిగులు టీచర్లను గుర్తించాలి. గతేడాది ఉపాధ్యాయుల పునర్విభ జనకు జారీచేసిన ఉత్తర్వులను స్వల్పంగా సవరించి తాజాగా ఎంతమంది టీచర్లు అవసరమో సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రకారం యూడైస్‌లోని విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా పిల్లలు తక్కువగా ఉన్న పాఠశాలల్లో మిగులు టీచర్లను, పెరిగిన పాఠశాలలకు ఎంతమందిని పంపాలనే లెక్కను తేల్చే బాధ్యతను పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలోని ఐటీ విభాగానికి అప్పగించారు. అక్కడ గుర్తించిన వివరాలను ధ్రువీకరించడమే ఇక్కడి మండల విద్యాధికారులు, జిల్లా ఉప విద్యాశాఖాధికారుల పని. పాఠశాలల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లు, మిగులుగా ఉన్న వారి వివరాలను ఎంఈవోల లాగిన్‌కు బుధవారం పంపారు. ఎంఈవోలు వాటిని పరిశీలించి ఏమైనా తేడాలు ఉంటే సవరించి డీఈవోలకు పంపాలి. డీఈవో ఆ వివరాలను పునఃపరిశీలించి ధ్రువీకరించి డైరెక్టర్ కార్యాలయ ఐటీ విభాగానికి పంపాల్సి ఉంది. పాఠశాల యాజమాన్యం, క్యాడర్ సబ్జెక్టు వారీగా సీనియారిటీ జాబితాలను గురువారం డైరెక్టర్ కార్యాలయ ఐటీ విభాగం తయారు చేసి ఎంఈవో లాగిన్‌కు పంపుతుంది. జాబితాల్లో ఏమైనా మార్పులు, చేర్పులు అవసరమైతే డీఈవో టిస్ డేటా ఆధారంగా మార్పులు చేసేందుకు అవకాశం ఇచ్చారు. శుక్రవారం ఎంఈవోలు తమ మండలాల్లో మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాలను డౌన్‌లోడ్ చేసి నోటీసు బోర్డుల్లో ఉంచాలి. మండలంలో మిగులు టీచర్లను తమ కార్యాలయానికి పిలిపించి వారి సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి వారు కోరుకున్న స్థానాలను కేటాయించాలి. మండల స్థాయిలో పూర్తయ్యాక ఆ వివరాలను డీఈవోకు అందజేయాలి. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో స్థానాలు కోరుకున్న వారికి లీప్ యాప్ ద్వారా నియామకపత్రాలు జారీ చేస్తారు. 27న మండలాల్లో మిగిలిపోయిన టీచర్లను సర్దుబాటు చేసేందుకు డివిజనల్ స్థాయిలో సీనియారిటీ జాబితాలు తయారు చేసి 28వ తేదీన విద్యాధికారులు సర్దుబాటు చేస్తారు. 29న డివిజనల్ స్థాయిలో మిగిలిన టీచర్లను జిల్లాస్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించి మిగిలి పోయిన ఖాళీలను కేటాయిస్తారు. 30న మండల, డివిజన్, జిల్లాస్థాయిలో పనిసర్దుబాటు చేసిన వారికి లీప్ వాప్ ద్వారా నియామక పత్రాలు జారీ చేస్తారు.