Share News

వాన కరువు.. ఎండ దంచుడు!

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:55 AM

జోరు వానలు కురవాల్సిన సమయంలో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరో వేసవిని తలపించేలా బుధవారం పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వాన కరువు.. ఎండ దంచుడు!

పలుచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 65.50శాతం లోటు వర్షపాతం

సాధారణం కన్నా 30శాతం మేర పెరిగిన విద్యుత్‌ వాడకం

ఒంగోలు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : జోరు వానలు కురవాల్సిన సమయంలో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరో వేసవిని తలపించేలా బుధవారం పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధిక ప్రాంతాల్లో పగటి పూట 36 డిగ్రీల కన్నా అధికంగానే ఉండగా కొన్నిచోట్ల 39 నుంచి 40 డిగ్రీల దాకా ఎండ కాచింది. దీంతో మధ్యాహ్నం వేళ బయటకు రావడానికి ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా జిల్లాలో సెప్టెంబరు అంటే జోరు వానలు కురిసే సమయం. వినాయక చవితి పండుగ నుంచి దీపావళి వరకు ఉండే నెలన్నర రోజుల వ్యవధిలోనే జిల్లా వార్షిక వర్షపాతంలో ఇంచుమించు సగం కురు స్తుంది. ఈ సమయంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జల్లులు పడుతూనే ఉంటాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు అటుఇటుగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23 నుంచి 25 డిగ్రీల లోపు ఉంటుంటాయి. అయితే ప్రస్తుతం ఎల్‌నినో జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోం ది. ఈ సీజన్‌ ఆరంభం (జూన్‌) నుంచి ఇప్పటివరకు సరైన వర్షం కురిసిన దాఖలాలు లేవు.

ఎల్‌నినో తీవ్ర ప్రభావం

నైరుతి రుతుపవనాలతో జిల్లాలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు సుమారు 394.1 మి.మీ సాధారణ వర్షపాతం నమోదవు తుంది. ఈ సమయానికి 307.50 మి.మీ నమోదు కావాల్సి ఉంది. అలా నైరుతి రుతుపవనాలతో కురిసే వర్షాలతో జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ పంటలు సాగు చేస్తారు. అలాంటిది ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రభావం నామమాత్రమే అయింది. ఈ సమయానికి సుమారు 307.50 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 107.50 మి.మీ మాత్రమే నమోదైంది. ఆప్రకారం చూస్తే సాధారణ వర్షపాతంలో 65.50 శాతం మేర లోటు ఉంది. అందులో జూలైలో 86.2 శాతం, ఆగస్టులో 81.20శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ఈ నెలలో అక్కడక్కడా కొద్దిపాటి జల్లులు పడినా పెద్దగా ప్రజలకు ఉపశమనం లభించలేదు. వర్షాభావ పరిస్థితులతో పంటలు సాగు ఏమాత్రం ముందుకు సాగలేదు.

కొండపిలో అత్యధిక ఉష్ణోగ్రతలు

జోరువానలు కురవాల్సిన ఈసమయంలో ఎండలు మండిపోవడంతోపాటు ఉక్క వాతావరణంతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత కనిపిస్తుండగా 11 గంటలకు 37 డిగ్రీలకు చేరుతోంది. అలా బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చాలా ప్రాంతాల్లో 39 నుంచి 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ సమయంలో అత్యధికంగా కొండపిలో ఏకంగా 39.60 డిగ్రీల ఎండ కాచింది. పొన్నలూరులో 39.21 డిగ్రీలు, వీవీపాలెంలో 39.20 డిగ్రీలు, పల్లామల్లిలో 39.19 డిగ్రీలు, దర్శి మండలం కొత్తపల్లిలో 39.10 డిగ్రీలు, లింగసముద్రం మండలం మొగలిచర్లలో 39.0 డి గ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధిక ప్రాంతాల్లో 37నుంచి 39 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి.

30శాతం పెరిగిన విద్యుత్‌ వినియోగం

ఈనెల 19 నుంచి నైరుతి నిష్క్రమణ ఆరంభమై నెలాఖరుకు పూర్తిగా భూమి మీద నుంచి వెళ్లిపోతాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఇలాంటి సమయంలో వర్షపు జల్లులు లేకుండా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం అన్ని వర్షాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. పంటల సాగు కాక వ్యవసాయ పనులు లేకపోగా పట్టణాలలో చిరువ్యాపారాలు చేసుకునే వారు, వివిధ ఫ్యాక్టరీలు, గనులు ఇతరత్రా వాటిలో పనిచేసే వారు ఈ వాతావరణంతో అవస్థలు పడుతున్నారు. ఇక జిల్లాలో తాజా పరిస్థితితో విద్యుత్‌ వాడకం పెరిగింది. సాధారణంగా జిల్లాలో 7 మిలియన్‌ యూనిట్ల వినియోగం ఉంటుంది. అలాంటిది ప్రస్తుత వాతావరణంతో 9 మిలియన్‌ యూనిట్లు వాడుతున్నారు. సుమారు 30శాతం మేర విద్యుత్‌ వాడకం పెరగ్గా రాత్రివేళ ఇళ్లలో ఏసీల వినియోగం పెరిగి ఆ సమయంలో అధికంగా విద్యుత్‌ వాడుతున్నట్లు సమాచారం.

Updated Date - Sep 17 , 2026 | 02:55 AM