సాసా అంతంతమాత్రం
ABN , Publish Date - Jun 21 , 2026 | 02:57 AM
జిల్లాలో శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర (సాసా) కార్యక్రమం అంతంతమాత్రంగా జరిగింది. రాష్ట్రప్రభుత్వం పరిశుభ్రత, పర్యావరణం, కాలుష్య నివారణ అంశాలను ప్రధానంగా భావించి అందుకోసం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రను చేపట్టింది.
చింతలపాలెంలో పాల్గొన్న మంత్రి స్వామి
పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు
ఒంగోలు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర (సాసా) కార్యక్రమం అంతంతమాత్రంగా జరిగింది. రాష్ట్రప్రభుత్వం పరిశుభ్రత, పర్యావరణం, కాలుష్య నివారణ అంశాలను ప్రధానంగా భావించి అందుకోసం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రను చేపట్టింది. ప్రతినెలా మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చింది. పల్లె, పట్టణం తేడా లేకుండా అన్నిప్రాంతాల్లో సచివాలయాలు, పంచాయతీల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రుల నుంచి గ్రామ, వార్డుస్థాయి ప్రజాప్రతినిధులు, కలెక్టర్ నుంచి సచివాలయం ఉద్యోగి వరకు అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం కావాలని సూచించింది. ఒక్కో నెలలో ఒక్కో అంశాన్ని ప్రధానంగా తీసుకొని చేస్తుండగా జిల్లాలో ఆ కార్యక్రమానికి రానురాను ప్రాధాన్యత లేకుండా పోతోంది. ఆ క్రమంలో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర అంతంతమాత్రంగానే సాగింది. చాలా ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది పెద్ద సీరియస్‌గా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న పరిస్థితి లేకపోగా ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, అధికారుల హాజరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. కొన్నిచోట్ల మాత్రం రోడ్లు ఊడ్చి చెత్త తొలగించి ప్రతిజ్ఞలు, పారిశుధ్య కార్మికులకు సన్మానాలు నిర్వహించారు. జరుగుమల్లి మండలం చింతలపాలెంలో మంత్రి డాక్టర్ స్వామి, లింగసముద్రం మండలం యర్రారెడ్డిపాలెంలో కలెక్టర్ రాజాబాబు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఒంగోలు నగరంలో ఇక్కడి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. దర్శిలో మునిసిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య పాల్గొనగా ఇతర ప్రాంతాల్లో మొక్కుబడిగా కార్యక్రమం సాగింది.