సంగమేశ్వరం శరవేగం
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:16 AM
పొన్నలూరు మండలం చెన్నిపాడు సమీపంలో పాలేరుపై రూపకల్పన చేసిన సంగమేశ్వరం ప్రాజెక్టు (రిజర్వాయర్)కు రాష్ట్రప్రభుత్వం రూ.166.40 కోట్లు మంజూ రు చేసింది. ఈమేరకు శనివారం ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఇరిగేషన్ ఒంగోలు సీఈ(ప్రాజెక్ట్స్)కి ఉత్త ర్వులు పంపారు.
ప్రాజెక్టుకు రూ.166.40 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్, నిమ్మలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి స్వామి
కొండపి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : పొన్నలూరు మండలం చెన్నిపాడు సమీపంలో పాలేరుపై రూపకల్పన చేసిన సంగమేశ్వరం ప్రాజెక్టు (రిజర్వాయర్)కు రాష్ట్రప్రభుత్వం రూ.166.40 కోట్లు మంజూ రు చేసింది. ఈమేరకు శనివారం ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఇరిగేషన్ ఒంగోలు సీఈ(ప్రాజెక్ట్స్)కి ఉత్త ర్వులు పంపారు. రాష్ట్రస్థాయిలో సంబం ధిత శాఖలకు ఆదేశాలు జారీచేశారు. కాగా 2026-27 తాజా బడ్జెట్‌లో రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టుకి రూ.25 కోట్లు కేటాయించింది. తిరిగి శనివారం రూ.166.40 కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చింది.
పట్టువదలని విక్రమార్కుడిలా...
ప్రాజెక్టు కోసం 2014-19 మధ్యకాలంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ప్రత్యేక శ్రద్ధతో పనిచేశారు. ఆయన కొంతమేరకు నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి కాంట్రాక్టర్‌తో పనులు కూడా తిరిగి మొదలుపెట్టించారు. కొంతమేరకు చేసిన ఆ కాంట్రాక్టర్ తనకు గిట్టుబాటు కాదంటూ పనులను వదిలేశారు. దీంతో తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను పూర్తిగా గాలికొదిలేసింది. తిరిగి ప్రజా ప్రభుత్వం వచ్చాక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్వామి పట్టుదలతో కీలక నాయకులు, రాష్ట్రప్రభుత్వ అధికారుల వద్దకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తిరిగి ప్రాజెక్ట్‌కు కొత్త ప్రతిపాదనలు తయారు చేయించారు. సాంకేతికపరమైన, ఇతర శాఖల అనుమతుల కోసం ప్రత్యేకంగా ఆయన వెంటపడ్డారు. రోజులతరబడి నిధుల మంజూరు కోసం కృషిచేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించింది.
కృతజ్ఞతలు తెలిపిన స్వామి..
రాష్ట్రప్రభుత్వం సంగమేశ్వరం ప్రాజెక్టుకు రూ.166.40 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు మంత్రి స్వామి వెల్లడించారు. ఆయన శనివారం ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కొండపి నియోజకవర్గంలో 9,500 ఎకరాలకు సాగునీరు, 60 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన చేశారన్నారు. పొన్నలూరు మండలంలోని సంగమేశ్వరం వద్ద పాలేరుపై నిర్మించే రిజర్వాయర్ పూర్తికి రాష్ట్రప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం చంద్రబాబునాయుడికి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌కు, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల అభివృద్ధికి, వ్యవసాయానికి దన్నుగా, తాగునీటి సమస్యను పరిష్కరించే నియోజకవర్గంలో పెద్ద ప్రాజెకు తన హయాంలో పూర్తిచేసుకోవడానికి అడుగులు పడటం ఆనందదాయకమన్నారు.