Share News

ముప్పై ఏళ్లకు మోక్షం..!

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:40 PM

ఫ్లోరిన్‌ రహిత రక్షిత తాగునీటి కోసం 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దోర్నాల ప్రజల కలలు సాకారం కానున్నాయి. ఆ దిశగా సంబంధిత అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు.

ముప్పై ఏళ్లకు మోక్షం..!
జమ్మిదోర్నాల వద్ద పైపులైను ఏర్పాటు చేస్తున్న పంచాయతీ కార్మికులు

దోర్నాలకు సాగర్‌ జలాలు

దూపాడు నుంచి ప్రత్యేక పైపులైన్లు

1995లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సాగర్‌ జలాలు పథకం నిర్మాణం

ఆ తర్వాత పట్టించుకోని పాలకులు

ప్రస్తుతం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు చొరవతో చురుగ్గా పనులు

నెలాఖరుకు అందుబాటులోకి

పెద్దదోర్నాల, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : ఫ్లోరిన్‌ రహిత రక్షిత తాగునీటి కోసం 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దోర్నాల ప్రజల కలలు సాకారం కానున్నాయి. ఆ దిశగా సంబంధిత అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. 1995లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం ప్రజలకు ఫ్లోరిన్‌ రహిత తాగునీటితో దాహార్తిని తీర్చేందుకు దూపాడు నుంచి సాగర్‌ జలాలు మళ్లించేలా పథకాన్ని రూపొందించారు. ఆ క్రమంలో మండలంలోని జమ్మిదోర్నాల, చిన్నదోర్నాల, దోర్నాల తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున వాటర్‌ ట్యాంకులను నిర్మించి పైపులైన్‌ను కూడా వేశారు. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో చుక్కనీరు దోర్నాల మండలానికి చేరలేదు. దీంతో దోర్నాల మండల ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. 30ఏళ్లు గడిచినా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ట్యాంకులు శిథిలావస్థకు చేరాయి. విలువైన సామగ్రి అపహరణకు గురయ్యాయి. ఈ క్రమంలో ప్రజల బాధలు విన్న టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు స్పందించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంబంధిత అధికారులతో చర్చించి తిరిగి పనులు ప్రారంభించేలా చొరవచూపారు. పంచాయతీ కార్యదర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ పంచాయతీ నిధులు సుమారు రూ.10 లక్షలతో పైపులైన్లు ఏర్పాటుచేసి జమ్మిదోర్నాల వద్ద మోటార్‌ను ఏర్పాటు చేసి పంపింగ్‌ విధానంతో దోర్నాల పంచాయతీకార్యాలయం వద్ద ఉన్న ట్యాంక్‌కు నీటిని ఎక్కిస్తారు.. ఆ తర్వాత అక్కడ నుంచి ట్యాపుల ద్వారా ప్రజలకు సాగర్‌ జలాలను అందించనున్నట్లు తెలిపారు. మునుముందు మరికొన్ని గ్రామాలకు కూడా విస్తరించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయని ఐదారు రోజుల్లో పూర్తి అవుతాయని ఆయన వివరించారు.

Updated Date - Apr 23 , 2026 | 11:40 PM