Share News

పేదల ఇళ్లకు మోక్షం

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:12 AM

పట్టణ పేదల సొంతింటి కల సాకారం కాబోతోంది. ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఎట్టకేలకు టిడ్కో ఇళ్ల పనులు పునఃప్రారంభమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఎనిమిదేళ్లుగా నిరీక్షిస్తున్న లబ్ధిదారుల ఇంటి ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయి.

పేదల ఇళ్లకు మోక్షం
మార్కాపురంలో సిద్ధమవుతున్న టిడ్కో ఇళ్లు

ఎనిమిదేళ్ల తర్వాత టిడ్కో పనుల్లో కదలిక

త్వరలో కేటాయింపులు, గృహప్రవేశాలు

ఇళ్లు రానివారికి ఈ నెలాఖరుకు నగదు జమ

గత వైసీపీ హయాంలో పేదల గూడుపై నిర్లక్ష్యం

ప్రజా ప్రభుత్వం రాకతో పనులు పునఃప్రారంభం

పట్టణ పేదల సొంతింటి కల సాకారం కాబోతోంది. ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఎట్టకేలకు టిడ్కో ఇళ్ల పనులు పునఃప్రారంభమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఎనిమిదేళ్లుగా నిరీక్షిస్తున్న లబ్ధిదారుల ఇంటి ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయి. అంతకంటే ముందుగా గృహాల కోసం డబ్బులు చెల్లించిన వారికి లాటరీలో రాకపోవడంతో నష్టపోకుండా వారు కట్టిన మొత్తాన్ని తిరిగి ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు, చింతల వద్ద అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. మిగిలిన పట్టణాల్లో కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

ఒంగోలు కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రజాప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పనులను వేగవంతం చేసిం ది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో సముదాయా లను సాలె గూళ్లుగా మార్చడంతో లబ్ధిదారుల్లో ఇంటి బెంగప ట్టుకుంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపో యిన పనులను పూర్తిచేసి, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించే దిశగా చర్యలు చేపట్టింది. పనులను పునఃప్రారం భించింది. అలాగే డబ్బులు చెల్లించి, ఇళ్లు రాని వారికీ న్యాయం చేసేందుకు నిధులు కేటాయించింది. ఇప్పటికే ఆ నగదు మునిసిపల్‌, కార్పొరేషన్‌ కమిషనర్ల ఖాతాలో జమఅయినట్లు సమాచారం. దీంతో ఈ నెలాఖరుకు ఇళ్లు రాని వారికి వారు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వనున్నారు.2017 అప్పటి టీడీపీ ప్రభుత్వంపేదల కోసం టిడ్కో ఇళ్లను మంజూరు చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరులో మొత్తం 7,200 హౌసింగ్‌ యూనిట్‌లు (గృహాల నిర్మాణానికి) చర్యలు చేపట్టింది. ఒంగోలు నగరపరిధిలోని చింతలలో ఫేజ్‌-1 కింద1,392 గృహాలు చేపట్టగా అప్పట్లోనే 60శాతంపైన పనులు పూర్తయ్యాయి. ఫేజ్‌-2 కింద580 ఇళ్ల నిర్మాణం చేపట్టగా వివిధ దశల్లో ఉండిపోయాయి. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. తిరిగి అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం ఫేజ్‌-1 యూనిట్ల పూర్తికి తొలి ప్రాధాన్యం ఇచ్చింది. అంతేకాకుండా 2019 నుంచి పెండింగ్‌ బిల్లుల చెల్లింపు సమస్య కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినట్లు గుర్తించింది. పనులు చేపట్టి ఇళ్లు పూర్తిచేయడానికి జిల్లావ్యాప్తంగా ఎంత నిధులు అవసరమో అధికారుల నుంచి నివేదికలు కోరింది. పూర్తిస్థాయిలో ఇళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు రూ.342.29 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. దీంతో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లుల విషయంలో భరోసా ఇవ్వడంతో పనులు తిరిగి ఊపందుకున్నాయి. అందిన సమాచారం మేరకు జూన్‌ ఆఖరుకు గృహ ప్రవేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది.

చురుగ్గా టిడ్కో ఇళ్ల పనులు

జిల్లాలో మొత్తం 9,568 యూనిట్‌లు పూర్తిచేయడానికి అవసరమైన రూ.342.29 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఒంగోలులో 4,128,మార్కాపురంలో 912, అద్దంకి 960, కందుకూరు 1,408, కనిగిరి 912, గిద్దలూరు 1,248 మొత్తం 9,568 పురోగతిలో ఉన్నాయి. బిల్లులు చెల్లింపునకు ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో తిరిగి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం రోడ్లు, డ్రెయిన్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఒంగోలులో మాత్రం తాగునీటి పైపులైను ఏర్పాటులో కొంత జాప్యం జరిగినట్లు సమాచారం. వాస్తవానికి ఈ మార్చికే గృహప్రవేశాలు జరుగనుండగా పైపులైను కారణంగా ఆలస్యమైంది. దీంతో జూన్‌లో గృహ ప్రవేశాలు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు.

ప్లాట్లు రానివారికి నెలాఖరులోపు తిరిగి డబ్బులు

గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల పథకాన్ని ప్రారంభించగా వేల సంఖ్యలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటికి లబ్ధిదారు వాటాగా రూ.లక్ష డిపాజిట్‌ చేశారు. అయితే లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లు దక్కని వారు ఎనిమిదేళ్లుగా తాము చెల్లించిన డబ్బులు రాకపోవడంతో నిరాశచెందారు. వారు కూడా నష్టపోకుండా ఉండేందుకు ప్రస్తుత ప్రజాప్రభుత్వం వారి నగదును తిరిగి చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే కొంత సొమ్మును కమిషనర్ల ఖాతాలో జమ చేసింది. ఈ నెలాఖారుకు మరికొంత విడుదల చేయనుంది. దీంతో ప్లాట్లు దక్కని వారికి డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టారు. అందిన సమాచారం మేరకు ఇళ్లు రాని 9,958 మందికి రూ.21.21 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 973 మంది లబ్ధిదారులకు గతంలోనే రూ.9.81 కోట్లు చెల్లించారు. మిగిలిన వారికి రూ.11.39 కోట్ల మేర పెండింగ్‌లో ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం రూ.6.28 కోట్లను విడుదల చేసింది. మరో రూ.5 కోట్లు ఈ నెలాఖరులోపు ఇవ్వనుంది. పూర్తిస్థాయిలో నిధులు వచ్చిన తర్వాత ప్లాట్‌లు దక్కని వారికి తిరిగి వారు చెల్లించిన డబ్బులు ఇవ్వనున్నారు.

Updated Date - Apr 08 , 2026 | 03:12 AM