ప్రజా ప్రభుత్వం చొరవతో 22ఏ భూములకు మోక్షం
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:45 PM
గత కొన్నేళ్లుగా 22ఏ కాలంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. క్లరికల్ తప్పుల వలన నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేటు భూములను నిర్ధిష్ట గడువులోపు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.
దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం
మార్కాపురం టౌన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గత కొన్నేళ్లుగా 22ఏ కాలంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. క్లరికల్ తప్పుల వలన నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేటు భూములను నిర్ధిష్ట గడువులోపు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఈ క్రమంలో పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు పూర్తి అధికారాలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. క్షేత్ర స్థాయిలో దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి కలెక్టర్ కార్యాలయానికి పంపితే వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారు. బాధితులు మీ సేవా కేంద్రాలు, మండల స్థాయిలో జరిగే రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకుంటే సాధ్యమైనంత త్వరగానే ఫైళ్లను పరిష్కరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చెప్పులరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకున్న నాథుడేలేడని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వెంటనే నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం చేస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
106 ఫైళ్లను పరిష్కరించిన అధికారులు
మార్కాపురం జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 516 ఫైళ్లు 22ఏ నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని దరఖాస్తు చేసుకున్నారు. వాటిల్లో ఇప్పటి వరకు 106 ఫైళ్లను పరిష్కరించి బాధితులకు న్యాయం చేశారు. మార్కాపురం నూతన జిల్లా కావడం దరఖాస్తుదారులకు కలిసొచ్చినట్టైంది. ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండటం, రెవెన్యూ అధికారులు చురుగ్గా పనిచేస్తుండడంతో బాధితులకు సత్వర పరిష్కారం లభిస్తోంది. మార్కాపురం జిల్లాలో ఇంకా వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తుతోపాటు 8 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా వాటిని ఆమోదిస్తున్నారు. అనంతరం ఫైళ్లను కలెక్టరేట్‌కు పంపుతున్నారు. చాలామంది అవగాహన లోపంతో సరైన పత్రాలు జత చేయకపోవడంతో దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయం వద్దనే ఆగిపోతున్నాయి. దరఖాస్తుతోపాటు 10(1) రిజిష్టర్, అడంగల్, సెటిల్‌మెంట్ ఫెయిర్ అడంగల్, పాత అసైన్‌మెంట్లు రిజిష్టర్లు, డీకేటీ పట్టాలు, రికార్డు ఆఫ్ హోల్డింగ్స్ (ఆర్‌వోహెచ్), రిజిష్టర్డ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, 8-ఎ రిజిష్టర్ తదితరాల్లో ఏవీ ఉన్నా జతచేస్తే నిషేధిత జాబితా నుంచి మోక్షం లభిస్తుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.