Share News

జీతం పెంచాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , Publish Date - Jul 11 , 2026 | 02:55 AM

వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా నిర్వహించారు.

జీతం పెంచాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి
కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

అంగన్‌వాడీల డిమాండ్‌

ఒంగోలులో కలెక్టరేట్‌ ముట్టడి

పీడీ హామీతో ఆందోళన విరమణ

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, హెల్పర్లు భారీగా తరలివచ్చారు. మూసివేసిన ప్రకాశం భవనం రెండు ప్రధాన ద్వారాల నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిం చారు. వీరిని సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంగన్‌వా డీల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ఇందిరా వతి అధ్యక్షతన జరిగిన ధర్నాలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచకపోతే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. వేతనాల పెంపు కోసం 42 రోజుల సమ్మె సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించారని మండిపడ్డారు. రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా అంగన్‌వాడీల వేతనాల పెంపుపై చర్చ జరగకపోవడం వారిని మోసం చేయడమే అవుతుందన్నారు. గుజరాత్‌ హైకోర్టు అంగన్‌వాడీ టీచర్లను మూడో తరగతి ఉద్యోగులుగా, హెల్పర్లను నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని తీర్పు ఇవ్వడమే కాకుండా ఆయా క్యాడర్ల బేసిక్‌ వేతనం అమలు చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం అమలు చేయడంతోపాటు పెన్షన్‌, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాడ్యుటీ, వేతనంతో కూడిన వైద్య సెలవులు సహా అన్ని సామాజిక భద్రతా పథకాలను వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు బీఎల్వోలతోపాటు అదనపు విధులు అప్పగిస్తే కేంద్రాలను ఎవరు నిర్వహిస్తారని ప్రశ్నించారు. అనంతరం ఐసీడీఎస్‌ పీడీ పద్మసునంద ధర్నా వద్దకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో అంగన్‌వాడీలు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కాలం సుబ్బారావు, సీహెచ్‌.మజుందార్‌, జి.శ్రీనివాసులు, రంగారావు, వెంకటేశ్వర్లు, పి.ఆంజనేయులు, జి.రమేష్‌, యూనియన్‌ ప్రతినిధులు ఎన్‌.ధనలక్ష్మి, జయప్రద, కె.హెమీమా, పద్మావతి, శారద, శేషమ్మ, క్రాంతి, రాజేశ్వరి, వరలక్ష్మి, జయమణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 02:55 AM