Share News

స్థానిక సమరానికి సై

ABN , Publish Date - Sep 08 , 2026 | 02:58 AM

‘స్థానిక’ పోరుకు రంగం సిద్ధమైంది. వరుసగా మునిసిపల్‌, జిల్లా, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించి స్పష్టత కూడా వచ్చింది.

స్థానిక సమరానికి సై

ఎన్నికల సమర్థ నిర్వహణ కోసం టీడీపీ, జనసేన ఇన్‌చార్జిల నియామకం

ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఇన్‌చార్జిలుగా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి, బీటీ నాయుడు

ఇక్కడి టీడీపీ నేతలకు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల బాధ్యతలు

ఒంగోలు పార్లమెంట్‌కు 11 మందితో జనసేన కమిటీ నియామకం

‘స్థానిక’ పోరుకు రంగం సిద్ధమైంది. వరుసగా మునిసిపల్‌, జిల్లా, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించి స్పష్టత కూడా వచ్చింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా జరిగిపోతోంది. దీంతో స్థానిక సమరంపై కూటమి పార్టీలు కూడా దృష్టి సారించాయి. సమన్వయం కోసం ఆయా పార్టీలు జిల్లాలకు ఇన్‌చార్జులుగా కీలక నాయకులను నియమించాయి. రెండు రోజుల క్రితం జనసేన ప్రకటించగా, తాజాగా టీడీపీ కూడా ఇన్‌చార్జులను నియమించింది.

ఒంగోలు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సమరానికి కూటమి పార్టీలు సై అంటున్నాయి. అధికారికంగా ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లపై ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కీలకమైన ఓటర్ల జాబి తాల సిద్ధంతోపాటు రిజర్వేషన్లకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి వార్డుల విభజన వంటి వాటిని పూర్తిచేశారు. ప్రభుత్వం కూడా అర్బన్‌ స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్లు, చైర్మన్ల ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సంస్థల పరిధిలో పోటీచేసే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నికల నామినేషన్‌ ధరావత్తు, వ్యయంపై కూడా స్పష్టత ఇచ్చింది. అలాగే ఈనెల 23తో మండల, 24తో జడ్పీ పాలకవర్గాల గడువు పూర్తికానుండటంతో ఈసారి కొత్త జిల్లాలకు అనుగుణంగా జడ్పీ ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన చోట్ల కొందరు అధికారుల నియామకాలను కూడా పూర్తి చేశారు.

సమన్వయం చాలా ముఖ్యం

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీ పార్టీలతో కూడిన కూటమి ఘన విజయాలు సాధించిన విషయం విదితమే. ఆ ఎన్నికల్లో 94శాతం ఫలితాలు కూటమి సాధించగా స్థానిక ఎన్నికల్లో 96శాతం విజయం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఐక్యంగానే సాగాలని కూటమి పార్టీలు నిర్ణయించుకోగా స్థానికంగా ఆ పార్టీల మధ్య సమన్వయం గతం కన్నా ఎక్కువ అవసరంగా కనిపిస్తోంది. అలాగే ప్రధాన పార్టీ అయిన టీడీపీతోపాటు జనసేనలో కూడా స్థానికంగా ఎక్కడికక్కడ పదవుల కోసం అనేకమంది క్రియాశీలక నాయకులు పోటీపడుతున్నారు. దీంతో కూటమిలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేనలకు అంతర్గతంగా పార్టీలో పదవులు కోరుకునే వారందరికీ సీట్లు ఇవ్వడం, అలాగే రెండు పార్టీల మధ్య స్థానాల కేటాయింపు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఈ విషయంలో స్థానికంగా పార్టీ బాధ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు సమస్య తలెత్తకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు రెండు ప్రధాన పార్టీలు జిల్లా, పార్లమెంట్‌ స్థాయిల్లో ఇన్‌చార్జిలను నియమించాయి.

పార్టీ ఆదేశాలకు అనుగుణంగా..

టీడీపీ అధిష్ఠానం రాష్ట్రంలోని ఒక్కో జిల్లాకు ఒక్కో ముఖ్యనేతను ఇన్‌చార్జిగా నియమించింది. అందులో ప్రకాశం జిల్లా ఇన్‌చార్జిగా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాలరెడ్డి, మార్కాపురం జిల్లాకు రాయలసీమకు చెందిన మరో ఎమ్మెల్సీ బీటీనాయుడును నియమించారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఎన్నికల సమర్థ నిర్వహణ, పార్టీ శ్రేణులందరూ ప్రక్రియలో భాగస్వాములను చేయడం, కూటమి పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలను వారు పర్యవేక్షించనున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో వారు కీలకంగా వ్యవహరిస్తారని సమాచారం. కాగా జిల్లాకు చెందిన మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యను చిత్తూరు జిల్లాకు, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీని తిరుపతి జిల్లాకు, ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను అన్నమయ్య జిల్లాకు ఇన్‌చార్జిలుగా టీడీపీ అధిష్ఠానం నియమించింది.

జనసేన కమిటీ నియామకం

కూటమిలో మరో ప్రధాన పార్టీ అయిన జనసేన కూడా రెండురోజుల క్రితమే పార్లమెంట్‌ స్థాయిలో సమన్వయ కమిటీలను నియమించింది. ఒంగోలు పార్లమెంట్‌కు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ సమన్వయకర్తగా కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో సభ్యులుగా మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెదపూడి విజయకుమార్‌, రాయపాటి అరుణ, వరికూటి నాగరాజులు ఉన్నారు. వారికి సపోర్టు టీమ్‌గా మరో ఏడుగురిని నియమించారు.

Updated Date - Sep 08 , 2026 | 02:59 AM