ఓబీసీకి చేరిన సాగర్ జలాలు
ABN , Publish Date - Sep 02 , 2026 | 02:46 AM
తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు మంగళవారం ఒంగోలు బ్రాంచ్ కాలువ (ఓబీసీ)కు చేరాయి. మంచినీటి చెరువులు అడుగంటడంతో ప్రభుత్వం నాలుగురోజుల క్రితం సాగర్ డ్యామ్ నుంచి కుడికాలువకు నీరు విడుదల చేసిన విషయం విదితమే. ఎగువ నుంచి గంటకు రెండు కిలోమీటర్ల చొప్పున ప్రవహిస్తూ మంగళవారానికి ఒంగోలు బ్రాంచ్ కాలువకు చేరాయి.
తాగునీటి వనరులు నింపేందుకు అధికారుల ఏర్పాట్లు
దర్శి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు మంగళవారం ఒంగోలు బ్రాంచ్ కాలువ (ఓబీసీ)కు చేరాయి. మంచినీటి చెరువులు అడుగంటడంతో ప్రభుత్వం నాలుగురోజుల క్రితం సాగర్ డ్యామ్ నుంచి కుడికాలువకు నీరు విడుదల చేసిన విషయం విదితమే. ఎగువ నుంచి గంటకు రెండు కిలోమీటర్ల చొప్పున ప్రవహిస్తూ మంగళవారానికి ఒంగోలు బ్రాంచ్ కాలువకు చేరాయి. ప్రస్తుతం సాగర్ డ్యామ్ వద్ద కుడి కాలువకు 6,553 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఆ నీరు బుగ్గవాగులోకి చేరుతోంది. బుగ్గవాగు నుంచి సాగర్ ప్రధాన కాలువకు 6,090 క్యూసెక్కులు ఇస్తున్నారు. ఆనీటిని గుంటూరు బ్రాంచ్ కాలువకు 1,500 క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచ్ కాలువకు 805 క్యూసెక్కులు, సాగర్ ప్రధాన కాలువ 55/3వ మైలుకు (ఉమ్మడి ప్రకాశం బార్డర్)కు 1,876 క్యూసెక్కుల సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు బ్రాంచ్ కాలువకు 809 క్యూసెక్కుల నీరు పంపిణీ అవుతోంది. బుధవారం నాటికి ఓబీసీకి పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉంది. రామతీర్థం జలాశయం, దర్శి ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకంతోపాటు జిల్లాలోని మంచినీటి పథకాలను నీటితో నింపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దర్శి ఎన్‌ఏపీ చెరువుకు నీరు పంపింగ్‌కు మోటార్లు సిద్ధం చేశారు.
దుర్వినియోగం కాకుండా అప్రమత్తంగా ఉండాలి
తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జాలాలు దుర్వినియోగం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేపల చెరువులకు దొంగచాటుగా నీరు నింపుకునేందుకు పాటదారులు కాసుకు కూర్చున్నారు. సుమారు రెండు నెలల క్రితం చేపలు పట్టుకునేందుకు చెరువుల్లో ఉన్న నీటిని ఖాళీ చేశారు ఎండలు వేసవిని తలపిస్తూ మండిపోతుంటే పట్టించుకోకుండా తమ స్వార్థం కోసం చెరువుల్లో నీరు వెల్లబెట్టారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో తీవ్ర తాగునీటి సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పశువులకు, గొర్రెలు, మేకలకు తాగునీటి అవసరాల కోసం చెరువులకు నీరు నింపాలని ఆయా గ్రామాల ప్రజలతో డిమాండ్ చేయించి చేపల చెరువులకు నీరు నింపే యత్నాలు పాటదారులు చేస్తున్నారు. అధికారులు ప్రలోభాలకు లోనయితే ఎంతో విలువైన నీరు వృథా అయ్యే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు అనేకసార్లు జరిగాయి. మంచినీటి అవసరాల కోసం నీరు విడుదలయినప్పుడల్లా ఏదోరకంగా చేపల చెరువులకు పెడుతున్నారు. ప్రస్తుతం తీవ్ర దుర్భిక్షం నెలకొనడం వల్ల అధికారులు అమ్రత్తంగా ఉంటేనే మంచినీటి చెరువులకు నీరు చేరుతుంది.