కురిచేడుకు చేరిన సాగర్ జలాలు
ABN , Publish Date - Sep 01 , 2026 | 02:57 AM
జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు సోమవారం సాయంత్రం కురిచేడు పక్కనే ఉన్న దర్శి బ్రాంచి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను తాకాయి. ఉదయం పది గంటల సమయంలో కురిచేడు సబ్ డివిజన్ సరిహద్దు 107 మైలు వద్దకు చేరాయి.
తాగునీటి అవసరాల కోసమే విడుదల
కురిచేడు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు సోమవారం సాయంత్రం కురిచేడు పక్కనే ఉన్న దర్శి బ్రాంచి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను తాకాయి. ఉదయం పది గంటల సమయంలో కురిచేడు సబ్ డివిజన్ సరిహద్దు 107 మైలు వద్దకు చేరాయి. సాయంత్రానికి కురిచేడు సమీపానికి వచ్చాయి. వీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని కురిచేడు సబ్‌డివిజన్ డీఈఈ అక్బర్ బాషా తెలిపారు. కురిచేడుకు చేరిన సాగర్ నీరు రామతీర్థం రిజర్వాయర్‌కు చేరే వరకు ఎవరూ వినియోగించవద్దన్నారు. రైతులు ఈనీటిని పంట పొలాలకు వాడవద్దన్నారు. చేపల చెరువులకు మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో చాలా చెరువులు ఎండిపోయి రక్షిత నీటి పథకాలు ఆగిపోయాయన్నారు. ముందుగా మంచినీటి చెరువులు నింపాలని ఆయన సూచించారు. ఎన్నెస్పీ సిబ్బంది నిత్యం కాలువలపై కాపలా కాస్తుంటారని, ఎవరైనా అక్రమంగా సాగర్ నీటిని వియోగిస్తే చర్యలు తప్పవన్నారు. సోమవారం సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 6,600 క్యూసెక్కులు, బుగ్గవాగు నుంచి దిగువకు 5,540 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు డీఈఈ అక్బర్ తెలిపారు. జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్ద 1,516 క్యూసెక్కులు, దర్శి బ్రాంచి కాలువకు 400 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నదని చెప్పారు. మంగళవారం ఉదయానికి దర్శి సమీపంలోని ఓబీసీకి చేరతాయని డీఈఈ తెలిపారు.