మంచినీటి చెరువులకు ముమ్మరంగా సాగర్ జలాలు
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:14 PM
దర్శి నియోజకవర్గంలోని మంచినీటి చెరువులకు ముమ్మరంగా నీరు సరఫరా చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం వారం రోజుల క్రితం సాగర్ జలాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.
దర్శి నియోజకవర్గంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, పలు చెరువులకు నీళ్లు
కాలువల నుంచి మోటార్ల ద్వారా పంపింగ్
దర్శి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): దర్శి నియోజకవర్గంలోని మంచినీటి చెరువులకు ముమ్మరంగా నీరు సరఫరా చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం వారం రోజుల క్రితం సాగర్ జలాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. 129 గ్రామాలకు మంచి నీరందించే దర్శి ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి చెరువుకు 9 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. 200 హెచ్‌పీ మోటార్లు రెండు, 100 హెచ్‌పీ మోటార్లు నాలుగు, 75 హెచ్‌పీ మూడు మోటార్లతో రోజుకు 50 మిలియన్ లీటర్ల నీరు చెరువుకు పంపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం చెరువులో సుమారు 800 మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉంది. పూర్తి నిల్వసామర్థ్యం 2,547 మిలియన్ లీటర్లు. ఇంకా పూర్తిగా నీరు నింపాలంటే 1847 మిలియన్ లీటర్లు పంపింగ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం పంపింగ్ జరుగుతున్న ప్రకారం చెరువు నిండాలంటే నెల రోజులకు పైగా సమయం పడుతుంది. ఎండలు మండిపోతుండటంతో తాగునీటి అవసరాలు పెరిగాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురవక గ్రామాల్లో బోర్లు కూడా అడుగంటాయి. అందువలన 90 శాతం ప్రజలు ఎన్‌ఏపీ ద్వారా విడుదలయ్యే నీటిపైనే ఆదారపడుతున్నారు. అధికారులు తాగునీటి సమస్య తీవ్రతను గుర్తించి వీలైనంత త్వరగా చెరువులకు నీరు నింపాల్సిన అవసరం ఉంది. అదనపు మోటార్లు ఏర్పాటు చేసి తక్కువ సమయంలో చెరువు నిండా నీరు పింపితే ఇబ్బందిలేకుండా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.
సాగర్ జలాలు దుర్వినియోగం కానివ్వొద్దు
సాగర్ జలాలు దుర్వినియోగం కాకుండా అదికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఒంగోలు ఇన్‌చార్జి ఎస్‌ఈ సతీష్ ఆదేశించారు. మంచినీటి చెరువులకు నీరు నింపేందుకు విడుదల చేసిన సాగర్ జలాలను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామతీర్థం జలాశయంతో పాటు జిల్లాలోని మంచినీటి చెరువులకు నీరు నింపేందుకు మాత్రమే ప్రభుత్వం సాగర్ జలాలను విడుదల చేసిందన్నారు. ఎవరైనా నీరు ట్యాంపరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఈఈ డీ స్వామి, డీఈ దేవసహాయం పాల్గొన్నారు.