సాగర్ కాలువలు మాయం
ABN , Publish Date - Jun 13 , 2026 | 02:59 AM
అద్దంకి పట్టణ చుట్టుపక్కల కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగర్ కాలువలను యథేచ్ఛగా ఆక్రమించి పంటలు సాగు చేయడంతోపాటు ఏకంగా వెంచర్‌లు కూడా వేస్తున్నారు.
పూడ్చివేసి రియల్ వెంచర్లు.. కొన్నిచోట్ల పంటల సాగు
దిగువ ఆయకట్టు భూములకు నీటి ప్రవాహానికి అడ్డంకులు
అధికారులు పట్టించుకోవాలని రైతుల వేడుకోలు
అద్దంకి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి పట్టణ చుట్టుపక్కల కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగర్ కాలువలను యథేచ్ఛగా ఆక్రమించి పంటలు సాగు చేయడంతోపాటు ఏకంగా వెంచర్‌లు కూడా వేస్తున్నారు. దర్శి రోడ్డు వెంబడి శంకరాపురం, తిమ్మాయపాలెం మధ్య ఇటీవల రియల్ వ్యాపా రులు భూములు కొనుగోలు చేశారు. వాటిలో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాకపోకలు సాగించేందుకు కాలువలను ఆక్రమిస్తున్నారు. అదేవిధంగా మోదేపల్లి మేజర్ నుంచివచ్చే తిమ్మాయపాలెం మైనర్ కాలువ ఆనవాళ్లు కూడా లేకుండా కొందరు రైతులు ఆక్రమించి చదును చేశారు. పలువురు ఇటుక బట్టీలను ఏర్పాటు చేశారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్లు వేసే క్రమంలో తిమ్మాయపాలెం మైనర్ కాలువను ఆక్రమించారు. వెంచర్ల మధ్యలో తిమ్మాయపాలెం మైనర్ కాలువ ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ప్లాట్లు వేస్తున్నారు. ఇందులో రాకపోకలు సాగించేందుకు కాలువను పూడ్చి కల్వర్టులు నిర్మిస్తున్నారు. ఐదారు నెలల క్రితం ఎన్‌ఎస్‌పీ అధికారులు తిమ్మాయపాలెం మైనర్ కాలువను ఆక్రమించి వెంచర్‌లు ఏర్పాటును గుర్తించి అడ్డుకున్నారు. కొంతకాలం పాటు ఆగి తిరిగి వెంచర్‌లో పనులు ప్రారంభించారు. దీంతో దిగువ ఆయకట్టుకు నీటి పారుదలకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాలువ బాగుకు నిధులు మంజూరు
రెండు దశాబ్దాల నుంచి కాలువకు నీటి విడుదల జరక్కపోవడంతో రైతులు పెద్దగా పట్టించుకోలేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ దిగువ ఆయకట్టు వరకు నీటి విడుదలకు చర్యలు చేపట్టడంతో ఈ ఏడాది మోదేపల్లి మేజర్ చివర ఆయకట్టుకు సైతం మెట్ట పంటల సాగుకు నీటి విడుదల జరిగింది. భవిష్యత్‌లో కూడా నీటి విడుదల జరిగే అవకాశం ఉండటంతో రియల్ వ్యాపారుల స్వార్థంతో కాలువలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్‌ఎస్‌పీ అధికారులు పరిశీలించిన సమయంలో పనులు నిలిపివేయడం, ఆ తర్వాత యథావిధిగా మరలా పనులు చేయడం సర్వసాధారణంగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. సాగర్ కాలువల మరమ్మతులకు నిధులు మంజూరైన నేపథ్యంలో తిమ్మాయపాలెం మైనర్ కాలువను కూడా పునర్నిర్మాణం చేస్తే ఆయకట్టుకు నీటి విడుదలకు అవకాశం ఉంటుందని రైతులు అభి ప్రాయపడుతున్నారు. అధికారులు స్పందించి తిమ్మాయపాలెం మైనర్ కాలువలో ఆక్రమణలు తొలగించి కాలువ పునర్నిర్మాణం చేయాలని కోరుతున్నారు.