Share News

వసతి సంక్షేమం

ABN , Publish Date - Jan 18 , 2026 | 02:53 AM

ఉమ్మడి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. హాస్టళ్లలో స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించింది. విద్యార్థుల కోసం దోమ తెరలను పంపిణీ చేయనుంది.

వసతి సంక్షేమం
ఒంగోలు హాస్టల్‌లో ఆర్వోప్లాంట్‌ వద్ద నీరు పట్టుకుంటున్న విద్యార్థినులు

హాస్టల్‌ విద్యార్థులకు దోమతెరలు

విడతల వారీగా పంపిణీకి సిద్ధం

స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణం

రూ.1.23 కోట్లు విడుదల

ఇప్పటికే కొన్నింటిలో ఆర్వో ప్లాంట్లు

మరికొన్ని చోట్ల ఏర్పాటుకు నిధులు

ఉమ్మడి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. హాస్టళ్లలో స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించింది. విద్యార్థుల కోసం దోమ తెరలను పంపిణీ చేయనుంది. విడతల వారీగా అన్ని హాస్టళ్లకు వీటిని ఇవ్వనుంది. అందుకు సంబంధించిన నిఽధులను విడుదల చేసింది. ఇప్పటికే జిల్లాలోని 12 వసతి గృహాల్లో రక్షిత మంచినీటి ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మరో తొమ్మిది చోట్ల మంజూరు చేసింది. అందుకు అనుగుణంగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఒంగోలు నగరం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వసతి గృహ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారికి రక్షిత నీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. స్నానపు గదులు, మరుగుదొడ్లను నిర్మించడంతోపాటు దోమతెరలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాలోని 68 బాలికల వసతి గృహాల్లో స్నానపు గదులు, 49 బాలికల వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.23కోట్లను విడుదల చేసింది. కంభం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతిగృహంలో ఏడు స్నానపు గదులు, దర్శి బాలికల ఎస్సీ హాస్టల్‌లో ఐదు స్నానపు గదులు, ఐదు మరుగుదొడ్లు, చీమకుర్తి ఎస్సీ బాలికల వసతి గృహంలో 12 స్నానపు గదులు, 12 మరుగుదొడ్లు, మార్కాపురం ఎస్సీ బాలికల వసతి గృహంలో 10 స్నానపు గదులు, 10 మరుగుదొడ్లు, ఎర్రగొండపాలెం ఎస్సీ బాలికల వసతి గృహంలో 12 స్నానపు గదులు, ఒంగోలు-2 ఎస్సీ బాలికల వసతి గృహంలో 12 స్నానపు గదులు, 12 మరుగుదొడ్లు, ఒంగోలు 3 ఎస్సీ బాలికల వసతి గృహంలో 10 స్నానపు గదులు, 10 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు.

దోమతెరలకు రూ.లక్షలు విడుదల

దోమల కారణంగానే అనేక ప్రాణాంతకమైన వాఽ్యధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వసతి గృహాల విద్యార్థులు దోమతెరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా జిల్లాలోని దొనకొండ, మారెళ్ల, దర్శి ప్రాంతాల్లోని నాలుగు వసతి గృహాల్లో చదువుతున్న 100మందికిపైగా విద్యార్థులకు అందజేయనున్నారు. ఇందుకు అవసరమైన రూ.5 లక్షల నిధులను సాంఘిక సంక్షేమశాఖ విడుదల చేసింది.

మరో తొమ్మిది వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్లు

జిల్లాలోని ప్రతి వసతి గృహంలో విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందుబా టులోకి తెచ్చేందుకు సాంఘిక సంక్షేమశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 12 వసతిగృహాల్లో రక్షిత మంచినీటి ప్లాంట్లను ఏర్పాటు చేసింది. తాజాగా మరో తొమ్మిది వసతి గృహాల్లో ఏర్పాటుకు నిధులను మంజూరు చేసింది. కురిచేడు, తాళ్లూరు, చంద్రశేఖరపురం, కాకర్ల, ఒంగోలు-3, ఎర్రగొండపాలెం, కనిగిరి కళాశాల విద్యార్థుల వసతిగృహం, పొదిలి, చీమకుర్తి లోని వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్లను రూ.11.25లక్షలతో త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ శాఖ డిఫ్యూటీ డైరెక్టర్‌ లక్ష్మానాయక్‌ తెలిపారు.

Updated Date - Jan 18 , 2026 | 02:53 AM