Share News

‘సదరం’ కిటకిట

ABN , Publish Date - Jul 22 , 2026 | 01:16 AM

దివ్యాంగులకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలకు సదరం సర్టిఫికెట్‌ తప్పనిసరి కావడంతో కష్టాలు తప్పడం లేదు. గత వైసీపీ హయాంలో అనర్హులకు సైతం సదరం సర్టిఫికెట్‌లు ఇష్టారాజ్యంగా ఇవ్వడంతో అర్హులకు అన్యాయం జరిగింది.

‘సదరం’ కిటకిట
సాధారణ రోగులు, సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చిన దివ్యాంగులతో కిటకిటలాడుతున్న ఒంగోలు జీజీహెచ్‌లోని ఓపీ విభాగం

సర్టిఫికెట్‌ కోసం దివ్యాంగుల అవస్థలు

జీజీహెచ్‌లో గంటల తరబడి పడిగాపులు

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగులకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలకు సదరం సర్టిఫికెట్‌ తప్పనిసరి కావడంతో కష్టాలు తప్పడం లేదు. గత వైసీపీ హయాంలో అనర్హులకు సైతం సదరం సర్టిఫికెట్‌లు ఇష్టారాజ్యంగా ఇవ్వడంతో అర్హులకు అన్యాయం జరిగింది. ప్రజాప్రభుత్వం వచ్చాక బోగస్‌ల ఏరివేత చేపట్టింది. గతంలో మంజూరైన వాటిని రీవెరిఫికేషన్‌ చేయాల్సి రావడంతో కొత్తగా అర్హులకు సర్టిఫికెట్‌ల మంజూరులో జాప్యం నెలకొంది. దీంతో సందరం సర్టిఫికెట్ల జారీ కోసం కేటాయించిన ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రితోపాటు, ఉమ్మడి జిల్లాలోని దర్శి, చీమకుర్తి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఆసుపత్రుల వద్ద ప్రతి మంగళవారం దివ్యాంగులు పడిగాపులు కాస్తున్నారు. ఈసారైనా సర్టిఫికెట్‌ వస్తుందన్న ఆశతో ఉదయాన్నే ఆసుపత్రుల వద్దకు చేరుకునే దివ్యాంగులు ఓపీ వద్దనే గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. వైద్యుని వద్దకు వెళ్లాక కూడా చాలాసేపు నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆతర్వాత కూడా అర్హత వస్తుందో రాదో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రతి మంగళవారం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం కొత్తగా ఫింఛన్లను విడుదల చేస్తే దరఖాస్తు చేసుకోవాలన్న ఆశపడుతున్న వారు సర్టిఫికెట్‌ మంజూరులో జాప్యంతో ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా అధికారులు ఆసుపత్రులకు వచ్చే దివ్యాంగులు, వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సదరం సేవలను సులభతరం చేయాలని కోరుతున్నారు.

Updated Date - Jul 22 , 2026 | 01:16 AM