Share News

సదరం.. దళారులకు వరం

ABN , Publish Date - Nov 15 , 2026 | 02:38 AM

ఒంగోలు జీజీహెచ్‌లో దోపిడీ పర్వం నడుస్తోంది. అర్హత కలిగిన ప్రతి దివ్యాంగుడికి పింఛన్‌ అందించి భరోసాగా నిలవాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే అందుకు అవసరమైన సదరం సర్టిఫికెట్‌ పొందాలంటే భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తున్నదని బాధితులు వాపోతున్నారు.

సదరం.. దళారులకు వరం
సదరం సర్టిఫికెట్‌ల కోసం ఒంగోలు జీజీహెచ్‌లో బారులు తీరిన దివ్యాంగులు (ఇన్‌సెట్‌లో) పరీక్షల కోసం వీల్‌ చైర్‌లు, స్ర్టెచర్‌పై వేచి ఉన్న దివ్యాంగులు

ఒంగోలు జీజీహెచ్‌లో అక్రమార్కుల రాజ్యం

దివ్యాంగుల అవసరాన్ని ఆసరా చేసుకొని వసూళ్లు

దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్‌ కాల్స్‌

పైసలివ్వకుంటే సర్టిఫికెట్‌ తిరస్కరణ

నెలల తరబడి దివ్యాంగుల అవస్థలు

ఒంగోలు జీజీహెచ్‌లో దోపిడీ పర్వం నడుస్తోంది. అర్హత కలిగిన ప్రతి దివ్యాంగుడికి పింఛన్‌ అందించి భరోసాగా నిలవాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే అందుకు అవసరమైన సదరం సర్టిఫికెట్‌ పొందాలంటే భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తున్నదని బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా అసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రైవేటు వ్యక్తులను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు ఉన్నాయి. సదరం కోసం వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనేది బహిరంగ రహస్యమే.

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు జీజీహెచ్‌లో దళారుల రాజ్యం కొనసాగుతోంది. దివ్యాం గులకు అండగా నిలవాల్సిన చోటే వసూళ్ల పర్వం నడుస్తోంది. జీవనం జరగక, పింఛన్‌ డబ్బులతోనైనా కనీసం మందు బిళ్లలు వస్తాయన్న ఆశతో సదరం సర్టిఫి కెట్‌ కోసం వస్తున్న అభాగ్యులను కొంద రు ప్రైవేటు వ్యక్తులు పీక్కుతింటున్నారు. అంగవైకల్యం, మానసిక వికలత్వం, చూపులేని వారు, కాళ్లు లేని వారికి సదరం కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.30వేలు డిమాండ్‌ చేయడం వైద్యశాఖలో ఇప్పుడు చర్చనీ యాంశంగా మారింది.

దళారుల చేతిలో దివ్యాంగుల వివరాలు

సదరం సర్టిఫికెట్‌ కోసం వచ్చేవారి వివరాలు వైద్యుల వద్ద ఉండాల్సి ఉండగా ఆ జాబితా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో జీజీహెచ్‌లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పనిచేసిన ఓ ఉద్యోగి ఇదేతరహా వసూళ్లకు పాల్పడటంతో అధికారులు అతనిని తొలగించారు. అయినప్పటికీ ఆయనవసూళ్ల వ్యవహారాన్ని విడిచిపెట్టడం లేదు.ఉదయం వైద్య పరీక్షలు పూర్తికాగానే... సాయంత్రం నుంచి సర్టిఫికెట్‌ కావాలంటే తనను కలవాలని ఫోన్‌ చేసి మరీ మాట్లాడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దళారులకు సహకరిస్తున్నది ఎవరు? ఇందులో భాగస్వాములు ఎవరెవరు? అనేది తేలాల్సి ఉంది.

పేదల అవసరాలే ఆదాయ వనరులుగా..

ప్రభుత్వం అందించే దివ్యాంగుల పింఛ న్‌కు అతి కీలకమైన పత్రం సదరం సర్టిఫి కెట్‌. ప్రభుత్వ వైద్యులు బాధితుడికి పరీ క్షలు నిర్వహించి, వికలత్వం నిర్ధారిస్తూ ధ్రువీకరణ పత్రం మంజూరు చేస్తారు. అయితే పూర్తిస్థాయిలో వైకల్యం కలిగిన వారు, మంచానికే పరిమితమైన వారు, కాళ్లు, కళ్లు లేనివారు ఇలా పలువురు బాధితులు జీజీహెచ్‌కు వస్తుంటారు. డాక్టర్లు వైద్యపరీక్షల వరకు అంతా సజా వుగానే సాగినట్లు కనిపిస్తుంది. పరీక్షలు కూడా పూర్తయ్యాయి, ఇక సర్టిఫికెట్‌ వస్తుందన్న ఆశ దరఖాస్తుదారుల్లో ఏర్ప డుతుంది. అయితే అసలు కథంతా ఇక్కడే మొదలవుతుంది. అదేరోజు సాయంత్రానికి దరఖాస్తు దారుడుకి ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. మీకు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రూ.30వేలు ఇస్తే మీకు సదరం అర్హత సర్టిఫికెట్‌ లభిస్తుందని చెప్తారు. దీంతో బేరసారాలు జరగడం జీజీహెచ్‌లో సర్వసాధారణమైంది. అంతమొత్తం చెల్లించుకోలేని వారు ప్రభుత్వ పింఛన్‌ను పొందలేక బిక్క మొఖం వేస్తున్నారు. జీజీహెచ్‌లో సదరం సర్టిఫికెట్ల మంజూరులో భారీగా అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. వీటిని అరికట్టాలని కొందరు దివ్యాంగులు జీజీహెచ్‌ అధికారులకు, రాష్ట్ర దివ్యాంగుల కమిషనర్‌కు, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. న్యాయం చేయాలని కోరారు. అవినీతి నిరోధకశాఖ అధికారులకు కూడా కొందరు ఫిర్యాదు చేశారు. అయితే వారి ఫిర్యాదులు మొక్కుబడి విచారణకే పరిమితమయ్యాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించి విజిలెన్స్‌ విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి రావడంతోపాటు, అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్‌ సులభతరంగా మంజూరయ్యే అవకాశం ఉందని బాధితులు కోరుతున్నారు.

Updated Date - Nov 15 , 2026 | 02:38 AM