Share News

నిత్యావసర సరుకుల కోసం వెళ్తూ మోపెడ్‌ను ఢీకొట్టిన కారు.. భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:23 PM

నిత్యావసర సరుకుల కోసమని పోలవరం నుంచి మోపెడ్‌పై అద్దంకికి వస్తున్నవారిని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.

నిత్యావసర సరుకుల కోసం వెళ్తూ మోపెడ్‌ను ఢీకొట్టిన కారు..   భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు
మృతి చెందిన రమణ

అద్దంకి,జనవరి1(ఆంధ్రజ్యోతి): నిత్యావసర సరుకుల కోసమని పోలవరం నుంచి మోపెడ్‌పై అద్దంకికి వస్తున్నవారిని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల కథనం మేరకు ముండ్లమూరు మండలం పోలవరంకు చెందిన చల్లా ఏడుకొండలు, రమణ దంపతులు. గురువారం రాత్రి మోపెడ్‌పై సరుకులు కొనుగోలు చేసి తీసుకువెళ్లేందుకు అద్దంకికి వస్తున్నారు. మండలంలోని తిమ్మాయపాలెం గుండ్లకమ్మ బ్రిడ్జి సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలైన దంపతులను 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమణ(46) మృతి చెందింది. తీవ్ర గాయాలైన ఏడకొండలును ఒంగోలు వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ సుబ్బరాజు పరిశీలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

కందుకూరులో విషాదం

కందుకూరు, జనవరి 1(ఆంధ్రజ్యోతి) : కందుకూరు పట్టణంలో సుపరిచితుడు, వెంకటశివాజీ షూమార్ట్‌ గుండవరపు నరసింహారావు పెద్దకుమారుడు వెంకటశివాజీ(38) మృతితో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. జాతీయ రహదారిపై నాయుడుపేట సమీపంలో బుధవారం ఆపిఉన్న వెంకటశివాజీ కారును భారీవాహనం ఢీకొనటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ వెంకట శివాజీ గురువారం మృతిచెందారు. కుమారుడు మృతితో తీవ్ర విషాదంలో ఉన్న నరసింహారావుకు పలువురు ప్రగాఢసంతాపం తెలిపారు. మృతుడు వెంకటశివాజీకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌లో వ్యక్తి గల్లంతు

సంతమాగులూరు(ఆంధ్రజ్యోతి):సంతమాగులూరు మండలం మామిళ ్లపల్లి వద్ద సాగర్‌ కాలువలో వ్యక్తి గల్లంతు అయ్యాడు. పోలీసుల కఽథనం మేరకు మామిళ్లపల్లికి చెందిన చిమటా రాంబాబు(40) బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత తన స్నేహితుడు మోటార్‌సైకిల్‌పై కొమ్మాలపాడుకు వెళ్తూ సాగర్‌ కాలువ దగ్గర దిగాడు. ముఖం కడుక్కోవాలని చెప్పి అద్దంకి మేజర్‌ కాలువలోకి దిగుతుండగా జారిపడి గల్లంతుఅయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు సాగర్‌ కాలువలో వెతికినప్పటికీ గురువారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. రాంబాబు భార్య నాగలక్ష్మి మామిళ్లపల్లి వార్డు మెంబర్‌గా ఉన్నారు.

రచ్చబండ పైనుంచి జారి పడి వ్యక్తి మృతి

సంతమాగులూరు(అద్దంకి),జనవరి1(ఆంధ్రజ్యోతి): సంతమాగులూరు మండలం కామేపల్లిలో రచ్చబండ పై నుంచి జారి పడ్డ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కఽథనం మేరకు కామేపల్లిలో గురువారం గంధం గురుస్వామి రచ్చబండపై నిలబడి కాలు జారి కింద పడ్డాడు. దీంతో తలకు రాయి తగలటంతో తీవ్ర గాయాలైన అక్కడికక్కడే మృతి చెందాడు.

Updated Date - Jan 01 , 2026 | 11:23 PM