గ్రామీణం కూటమికే జై
ABN , Publish Date - Nov 10 , 2026 | 02:35 AM
పల్లె జనం టీడీపీ కూటమివైపే అత్యధికంగా నిలిచారు. ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో జిల్లాలో కూటమి పూర్తి ఆధిక్యత సాధించింది. మొత్తం 27 జడ్పీటీసీలు, 371 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ 23, జనసేన 2 కలిపి కూటమి 25 స్థానాలు గెలుచుకుంది.
62.71శాతం పల్లె ఓటర్లు అండ
దర్శి సెగ్మెంట్లో ఏకంగా 76.47శాతం
వైసీపీకి జిల్లాలో వచ్చింది 34.33శాతం
గరిష్ఠంగా ఒంగోలులో 44.07శాతం
జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వెల్లడి
27 స్థానాలకు 25 జడ్పీటీసీలు
కైవసం చేసుకున్న కూటమి
పల్లె జనం టీడీపీ కూటమివైపే అత్యధికంగా నిలిచారు. ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో జిల్లాలో కూటమి పూర్తి ఆధిక్యత సాధించింది. మొత్తం 27 జడ్పీటీసీలు, 371 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ 23, జనసేన 2 కలిపి కూటమి 25 స్థానాలు గెలుచుకుంది. వైసీపీ కేవలం రెండింటికే పరిమితమైంది. అలాగే 371 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించగా 319 స్థానాల్లో టీడీపీ, 11 చోట్ల జనసేన వెరసి 330 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. వైసీపీ కేవలం 36కే పరిమితమైంది. ఐదు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.
ఒంగోలు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : పరిషత్ పోరులో పల్లె ఓటర్లు కూటమికే జైకొట్టారు. పార్టీ సింబల్స్ ప్రకారం ఈ ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీల్లో అనేకం ఏకగ్రీవాలు కాగా జడ్పీటీసీల్లో 27 స్థానా లకు 25 చోట్ల ఎన్నికలు జరిగాయి. అంటే ఎన్నికలు జరిగిన మండలాల్లో అసెంబ్లీ ఎన్నికల తరహాలో పార్టీ సింబల్స్కు ఓట్లు వేశారు. అలా జరిగిన జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు లభించిన ఓట్లను పరిశీలిస్తే టీడీపీకి 55.16శాతం, జన సేనకు 7.55శాతం వెరసి కూటమికి 62.71శాతం ఓట్లు లభించాయి. వైసీపీకి కేవలం 34.33శాతం మాత్రమే దక్కాయి. ఇతరులకు 2.96శాతం ఓట్లు వచ్చాయి.
వైసీపీకి దర్శిలో అత్యల్ప ఓటింగ్
జిల్లాలోని మొత్తం 27 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరిగిన 25 జడ్పీటీసీలలో మొత్తం 6,91,834 ఓట్లు పోలయ్యాయి. వాటిలో టీడీపీకి 3,81,612, జనసేనకు 52,233 వెరసి కూటమికి 4,33,645 ఓట్లు వచ్చాయి. వైసీపీకి 2,37,503 ఓట్లు రాగా, ఇతరులకు మరో 20,486 ఓట్లు లభించాయి. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. టీడీపీ కూటమికి అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో ఏకంగా 76.47శాతం ఓట్లు లభించగా అక్కడ వైసీపీకి కేవలం 21.44శాతం మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత అద్దంకి నియోజకవర్గంలో కూటమికి 65.19 శాతం లభించగా ఇక వైసీపీ జిల్లా మొత్తంగా 34.33శాతం ఓట్లు లభించాయి. గరిష్ఠంగా ఒంగోలు నియోజకవర్గంలో 44.07శాతం వచ్చాయి. అలాగే కందుకూరు, సంతనూతలపాడు సెగ్మెంట్లలోనూ 40శాతం మించి వైసీపీకి ఓట్లు వచ్చాయి.
అద్దంకి నియోజకవర్గంలో 1,47,519 ఓట్లు పోల్ కాగా టీడీపీకి 65.19శాతంతో 96,167 ఓట్లు లభించాయి. అక్కడ వైసీపీకి 32.14శాతంతో 47,419 ఓట్లు వచ్చాయి.
దర్శి నియోజకవర్గంలో 1,42,607 ఓట్లు పోల్ కాగా టీడీపీ, జనసేన కూటమికి 76.47శాతంతో ఏకంగా 1,09,324రాగా, వైసీపీకి కేవలం 21.44శాతంతో 30,586 ఓట్లు మాత్రమే లభించాయి.
కొండపి నియోజకవర్గంలో 1.09,548 ఓట్లు పోల్ కాగా, టీడీపీ, జనసేన కూటమికి 61.84 శాతంతో 67,747 ఓట్లు రాగా, వైసీపీకి అక్కడ 35.55శాతంతో 38,953 ఓట్లు లభించాయి.
సంతనూతలపాడు నియోజకవర్గంలో 1,25,066 ఓట్లు పోల్ కాగా టీడీపీ కూటమికి 55.74శాతంతో 69,721 లభించగా, వైసీపీకి అక్కడ 40.07శాతంతో 50,118 ఓట్లు వచ్చాయి.
ఒంగోలు నియోజకవర్గంలో 45,176 ఓట్లు పోల్ కాగా టీడీపీ కూటమికి 52.97శాతంతో 23,934 ఓట్లు రాగా, వైసీపీకి ఇక్కడ 44.07శాతంతో 10,911 ఓట్లు లభించాయి. ఈ నియోజకవర్గంలో కొత్తపట్నం జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది.
కందుకూరు నియోజకవర్గంలో 1,21,918 ఓట్లు పోల్ కాగా టీడీపీ, జనసేన కూటమికి 54.90శాతంతో 66,932 లభించగా వైసీపీకి సుమారు 41.43శాతంతో 50,516 ఓట్లు లభించాయి. ఇక్కడ ఉలవపాడు జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది.