Share News

గ్రామీణ రోడ్లకు మహర్దశ

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:50 PM

గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరయ్యాయి. పల్లె పండుగ 3.0 కింద జిల్లాలో సుమారు రూ.132.10 కోట్లతో 434 పనులు మంజూరయ్యాయి. వాటికి అనుమతులు ఇస్తూ కలెక్టర్‌ పి.రాజాబాబు ఉత్తర్వులు జారీచేశారు. వీటిని వీబీ జీరామ్‌జీ మెటీరియల్‌ కోటా నిధులతో ప్రభుత్వం చేపడుతోంది.

గ్రామీణ రోడ్లకు మహర్దశ

పల్లె పండుగ 3.0 కింద జిల్లాలో రూ.132 కోట్లతో 434 పనులు మంజూరు

29న నెల్లూరు జిల్లా రామాపురంలో రాష్ట్రస్థాయిలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం, డిప్యూటీ సీఎం

ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలుతున్న ప్రజానీకం

కనిగిరి, కందుకూరుల నుంచి అధికం

గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరయ్యాయి. పల్లె పండుగ 3.0 కింద జిల్లాలో సుమారు రూ.132.10 కోట్లతో 434 పనులు మంజూరయ్యాయి. వాటికి అనుమతులు ఇస్తూ కలెక్టర్‌ పి.రాజాబాబు ఉత్తర్వులు జారీచేశారు. వీటిని వీబీ జీరామ్‌జీ మెటీరియల్‌ కోటా నిధులతో ప్రభుత్వం చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.10వేల కోట్లు మంజూరు చేసింది. పనులను రాష్ట్రస్థాయిలో ఈనెల 29న మార్కాపురం, నెల్లూరు జిల్లా సరిహద్దులోని ఉదయగిరి నియోజకవర్గం వరికూటిపాడు మండలం రామాపురంలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి భారీగా ప్రజానీకం తరలివెళ్లనుంది. అందుకు సంబంధించి టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒంగోలు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ అధికారంలో ఉన్న 2014-19 మధ్య కాలంలో అప్పటి నరేగా పథకం మెటీరియల్‌ కోటా నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్‌లు, శ్మశానాల అభివృద్ధి, పశువుల షెడ్లు, పాఠశాలలు ప్రహరీలు, పంచాయతీ, అంగన్వాడీ భవన నిర్మాణాలు ఇలా అనేక పనులు చేశారు. అప్పట్లో ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యి కోట్ల వరకు ఈ పనులకు వెచ్చించారు. తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిఏడాది రూ.185 కోట్లు, గత ఏడాది రూ.126 కోట్లు వెరసి సుమారు రు.310 కోట్లకు పైగా ఈ పథకం కింద పల్లెపండుగ 1.0, పల్లె పండుగ 2.0 పేరుతో చేపట్టి పూర్తిచేశారు. ఈ పనుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పంచాయితీరాజ్‌ శాఖను నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ క్రమ పద్ధతిలో చేయిస్తున్నారు.


ఒక్కో పనికి గరిష్ఠంగా రూ.50లక్షలు

జిల్లాలో నెలరోజులుగా క్షేత్రస్థాయిలో డ్వామా అధికారులు, పీఆర్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలన చేశారు. సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్‌లు లేని హ్యాబిటేషన్లు, అలాగే ఒక గ్రామంలోని వివిధ ఆవాసాలు లేదా ప్రధాన రహదారుల నుంచి గ్రామాల వరకు ఉన్న రోడ్లలో మెటల్‌ రోడ్లు ఉన్నవి గుర్తించారు. అలాంటి గ్రామాలకు ప్రాధాన్యం ఇచ్చి మెటల్‌ స్థానంలో తారు రోడ్ల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత రోడ్లను సిమెంట్‌ రోడ్లు, వాటికి అనుబంధంగా డ్రెయిన్‌ల పనులు ఈ విడత చేపడుతున్నారు. గరిష్ఠంగా ఒక్కో పని రూ.50 లక్షలకు మించకుండా చర్యలు తీసుకున్నారు. అలా ఇప్పటివరకు ఆరు నియోజకవర్గాలలో 397 పనులకు రు.121.10 కోట్లు, ఎంపీ మాగుంట సిఫారసుతో మరో 37 పనులకు రూ.11 కోట్లు మంజూరు చేశారు. మరికొన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీ చూస్తే గరిష్ఠంగా కందుకూరులో 131 పనులకు రు.26.58 కోట్లు మంజూరు చేశారు. కొండపిలో 51 పనులకు రూ.20.60 కోట్లు, దర్శిలో 49 పనులకు రూ.20.40 కోట్లు, కనిగిరిలో 49 పనులకు రూ.20 కోట్లు, అద్దంకిలో 80 పనులకు రూ.18.52 కోట్లు, ఒంగోలులో 37 పనులకు రూ.15.30 కోట్లు కేటాయించారు.

పల్లెపండుగ 3.0 కింద భారీగా పనులు

పల్లెపండుగ 3.0 పేరుతో తాజాగా భారీగా పనులు మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం నరేగా పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టానికి సవరణ చేసి వీబీ జీరామ్‌జీగా మార్పు చేయగా ఈ ఏడాది జూలై నుంచి నూతన చట్టం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చట్టం మెటీరియల్‌ కోటా కింద పల్లెపండుగ 3.0 పేరుతో నిధులు మంజూరు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు వీబీ జీరామ్‌జీ పథకం కింద సుమారు 65 లక్షల పని దినాలు పూర్తికాగా మార్చిలోపు మరో 40 లక్షల పని దినాల కల్పన జరుగుతుంది. తద్వారా కూలీలకు సుమారు రూ.300 కోట్ల మేర వేతనాలు లభించనున్నాయి. మెటీరియల్‌ కోటా కింద సుమారు రూ.180 కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో దాదాపు రూ.240 కోట్లు గతంలో చేసిన పనులకు ఇప్పటికే చెల్లింపులు జరిగాయి. మిగిలిన నిధులను ప్రస్తుతం పల్లె పండుగ 3.0 కింద మంజూరు చేశారు.

రామాపురంలో సీఎం కార్యక్రమానికి భారీగా జనసమీకరణ

పల్లెపండుగ 3.0ను రాష్ట్రస్థాయిలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో ఈనెల 29న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మండల కేంద్రమైన పామూరుకు అత్యంత సమీపంలో ఆ గ్రామం ఉంది. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి కూడా పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులను తరలిస్తున్నారు. ప్రత్యేకించి కనిగిరి నియోజకవర్గం నుంచి 20 వేల మంది తరలి వెళ్లేలా అక్కడి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మరో సమీప నియోజకవర్గం కందుకూరుతోపాటు మార్కాపురం నుంచి కూడా భారీగా జనసమీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం కందుకూరులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని జన సమీకరణపై సూచనలు చేశారు.

Updated Date - Sep 26 , 2026 | 11:50 PM