Share News

పింఛన్‌ కోసం పరుగులు

ABN , Publish Date - Sep 10 , 2026 | 03:21 AM

కూటమి ప్రభుత్వం అర్హులైన అందరికీ పింఛన్‌ అందించేందుకు చర్యలు చేపట్టింది. దరఖాస్తుకు ఈనెల 7 నుంచి అవకాశం కల్పించింది. దీంతో వేలాది మంది స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు పరుగులు పెడుతు న్నారు. అక్కడ బారులు తీరుతున్నారు.

పింఛన్‌ కోసం పరుగులు
ఒంగోలులోని స్వర్ణ వార్డులో వేచి ఉన్న పింఛన్‌ దరఖాస్తుదారులు

మూడు రోజుల్లో ఎనిమిది వేలకుపైగా దరఖాస్తులు

రోజురోజుకూ పెరుగుతున్న సంఖ్య

సర్వర్‌ సమస్యతో ప్రక్రియలో జాప్యం

ఒంగోలు నగరం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం అర్హులైన అందరికీ పింఛన్‌ అందించేందుకు చర్యలు చేపట్టింది. దరఖాస్తుకు ఈనెల 7 నుంచి అవకాశం కల్పించింది. దీంతో వేలాది మంది స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు పరుగులు పెడుతు న్నారు. అక్కడ బారులు తీరుతున్నారు. తొలిరోజు సోమవారం జిల్లావ్యా ప్తంగా కేవలం 254 దరఖాస్తులు మాత్రమే అందాయి. బుధవారం నాటికి వీటి సంఖ్య 8,050కి చేరింది. ఒక్క మంగళవారం 6వేల మందికిపైగా పింఛన్‌ కోసం అప్లై చేసుకున్నారు. బుధవారం అందిన వాటితో కలుపు కొని దరఖాస్తుల సంఖ్య 8,050కి చేరింది. వాటిలో వృద్ధాప్య పింఛన్‌ కోసం అధికంగా 4,774 అందాయి. వితంతు పింఛన్ల కోసం 2,096, దివ్యాంగ 1,083, మత్స్యకార 32, ఒంటరి మహిళలు 16, చేనేత 16, చర్మకార 15, డప్పు కళాకారులు 8, కల్లుగీత 8, ట్రాన్స్‌జెండర్‌ పింఛన్ల కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు.

సర్వర్‌ సమస్యతో జాప్యం

ప్రభుత్వం రెండేళ్ల నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించలేదు. దీంతో అర్హులైన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఒక్కసారిగా దరఖాస్తుదారులు వస్తుండటంతో నమోదు ప్రక్రియలో జాప్యం నెలకొంది. సర్వర్లు ఆలస్యంగా పనిచేస్తున్నాయంటూ సిబ్బంది చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు గంటల తరబడి కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.

తహసీల్దార్లు అందుబాటులో ఉండటం లేదంటూ ఆందోళన..

పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునే ఒంటరి మహిళ, వితంతువులు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ధ్రువీకరణపత్రం తీసుకోవాల్సి ఉంది. పెళ్లి కాకుండా 35ఏళ్లు దాటిన మహిళలు కూడా ఒంటరి మహిళల కేటగిరీలో పింఛన్‌ పొందాలంటే తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి ధ్రువీకరణ పత్రం అవసరం. భర్త నుంచి విడిపోయిన వారు కూడా సంబంధిత కార్యాలయం నుంచి సర్టిఫికెట్‌ పొందాలి. దీంతో ఈ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకునే వారు తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళుతున్నారు. కొన్ని మండలాల్లో తహసీల్దార్లు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 16వ తేదీతో దరఖాస్తుకు గడువు ముగుస్తుంది. ఉన్నతాధికారులు అధికారులను అందుబాటులో ఉంచి ధ్రువీకరణ పత్రాలను త్వరితగతిన ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Sep 10 , 2026 | 03:21 AM