సీసాకు రూ.10
ABN , Publish Date - Jan 14 , 2026 | 02:39 AM
రాష్ట్రంలో మద్యం ధరలను ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. మంగళవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి సీసాపై రూ.10 పెరిగింది. బార్లపై ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌టీ)ను తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
మద్యం ధర పెంపు
బార్లపై ఏఆర్‌టీ రద్దు
రూ.99 బ్రాండ్‌లు యఽథాతఽథం
ఒక్కరోజు ఆర్డర్ రూ.12.75 కోట్లు
ఒంగోలుక్రైం, జనవరి13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం ధరలను ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. మంగళవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి సీసాపై రూ.10 పెరిగింది. బార్లపై ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌టీ)ను తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం బార్లపై 10ఽశాతం ఏఆర్‌టీ విధించింది. దీంతో బార్లలో మద్యం కొనుగోలుపై అదనంగా 10శాతం చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత ఉత్త ర్వుల మేరకు మద్యం దుకాణాలకు, బార్లకు మధ్య కొనుగోలు ధరలు ఒకేలా ఉంటాయి. అదేవిధంగా ఇప్పటివరకు లైసెన్సీలకు 15శాతం కమిషన్ ఉండగా ఒక్కశాతం పెంచుతూ ప్రభు త్వం ఉత్తర్వులు ఇచ్చింది. గతేడాది జనవరిలో జిల్లాలో రూ.106 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ 13 రోజులలో రూ.57 కోట్ల మద్యం అమ్మారు. ఈనెల 12న లైసెన్సీలు అత్యంత భారీగా రూ.12.75 కోట్లకు మద్యం కొనుగోలు చేశారు. డిపో నుంచి 13న కేవలం కోటి 70లక్షలు వరకు కొనుగోలు జరిగినట్లు తెలిసింది. అంటే ధరలు పెరుగుతాయని తెలుసుకున్న మద్యం వ్యాపారులు సోమవారం ఒక్క రోజే భారీగా మద్యం కొనుగోలు చేశారు. దీంతో ఈనెలలో రూ.120కోట్ల మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. పెంచిన ధరల ప్రకారం అదనంగా 10 నుంచి 15శాతం విక్రయాలతో ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో పెరిగిన మద్యం ధరలు
పెరిగిన మద్యం ధరలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. బీరు, వైన్, రూ.99 బ్రాండ్లకు మినహాయింపు ఇచ్చారు. మిగిలిన అన్ని బ్రాండ్లపైన పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి సీసాకు రూ.10 పెంచారు. ఉమ్మడి జిల్లాలో 25 బార్లు, 171 మద్యం దుకాణాలు, 18 గీత కార్మికుల దుకాణాలు ఉన్నాయి. ఇంకా 3 బార్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీంతో పాత ధరలో మద్యం అధిక మొత్తంలో కొనుగోలు చేసిన వ్యాపారులకు అదనంగా ఆదాయం లభించనుంది.