Share News

పొగాకు రైతులకు రూ.94 కోట్లు

ABN , Publish Date - Sep 04 , 2026 | 02:37 AM

పొగాకు రైతులకు రూ.94 కోట్ల బోనస్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలకు డీబీటీ విధానంలో జమ చేసేలా మార్క్‌ఫెడ్‌కు కేటాయిస్తూ గురువారం జరిగిన క్యాబినెట్‌ భేటీలో తీర్మానం చేశారు.

పొగాకు రైతులకు రూ.94 కోట్లు

మార్క్‌ఫెడ్‌కు కేటాయిస్తూ మంత్రివర్గ తీర్మానం

ఒంగోలు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతులకు రూ.94 కోట్ల బోనస్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలకు డీబీటీ విధానంలో జమ చేసేలా మార్క్‌ఫెడ్‌కు కేటాయిస్తూ గురువారం జరిగిన క్యాబినెట్‌ భేటీలో తీర్మానం చేశారు. రాష్ట్రంలో పొగాకు మార్కెట్‌ తీవ్ర సంక్షోభంలో ఉండి రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా జోక్యం చేసుకొని సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే అక్కడి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో రాష్ట్రప్రభుత్వం నుంచే కొంత మొత్తం బోనస్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం అన్ని గ్రేడ్‌లకు కాకుండా లోగ్రేడ్‌, ఆఫ్‌స్టైల్‌ రకాలకు క్వింటాకు రూ.వెయ్యి ఇవ్వాలని భావించారు. ఆ గ్రేడ్‌లు అమ్మిన పొగాకు రైతుల వివరాలను బోర్డు అధికారుల నుంచి తీసుకొని వారి ఖాతాల్లో నేరుగా డీబీటీ విధానంలో నగదు జమ చేసేలా సీఎం ఆదేశించారు. రెండు గ్రేడ్‌లు సుమారు 94 మిలియన్‌ కిలోలు ఉంటుందని అంచనా కాగా అందుకోసం రూ.94కోట్లు అవసరమని గుర్తించి ఆ మొత్తానికి అనుమతిస్తూ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.

Updated Date - Sep 04 , 2026 | 02:37 AM