Share News

ఒక్క రోజు రూ. 319.78 కోట్లు

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:00 AM

జిల్లాలో ఒకేరోజు వివిధ కేటగిరీలకు చెందిన పింఛన్‌దారులకు, అలాగే రైతులకు భారీగా ప్రభుత్వ సాయం అందింది. ప్రతినెలా 1న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి ఏడెనిమిది కేటగిరీలకు చెందిన వారికి ప్రభుత్వం పింఛన్‌లను అందజేస్తు న్న విషయం విదితమే.

ఒక్క రోజు రూ. 319.78 కోట్లు

రెండు రోజుల ముందుగానే పింఛన్‌ల పంపిణీ

రైతుల బ్యాంకు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నగదు

ఎన్నికల కోడ్‌తో సాదాసీదాగా కార్యక్రమాలు

ఒంగోలు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఒకేరోజు వివిధ కేటగిరీలకు చెందిన పింఛన్‌దారులకు, అలాగే రైతులకు భారీగా ప్రభుత్వ సాయం అందింది. ప్రతినెలా 1న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి ఏడెనిమిది కేటగిరీలకు చెందిన వారికి ప్రభుత్వం పింఛన్‌లను అందజేస్తు న్న విషయం విదితమే. అలాగే ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం నిధులు రైతులకు ఇస్తున్నారు. ఈ రెండు రకాల నిధులు శుక్రవారం లబ్ధిదారులకు అందాయి. మొత్తం రూ.319.78 కోట్ల మేర సుమారు 4.03లక్షల మందికి ప్రభుత్వం ఒకేరోజు ఇచ్చింది. అందులో 2.16 లక్షల మందికి రూ.94.13 కోట్ల పింఛన్లు అందాయి. సుమారు 1.87లక్షల మంది రైతులకు రూ.125.66కోట్లు అన్నదాత-సుఖీభవ నిధులు పడ్డాయి. సాధారణంగా ఈ రెండు కార్యక్రమాలను ప్రభుత్వం భారీగానే నిర్వహిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఏదో ఒకచోట ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే జిల్లాలో మంత్రులు, ఇతర కీలక నేతలు తమతమ ప్రాంతాల్లో హాజరవుతారు. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. దీంతో అధికారికంగా ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించే అవకాశం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

సాయంత్రానికి 88శాతం పూర్తి

క్షేత్రస్థాయిలో స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామాల సిబ్బంది పింఛన్లు పంపిణీ చేశారు. ఉదయం 6 గంటలకే పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి ఆ మొత్తాలను అందజేశారు. అలా ఉదయం 10 గంటలకే మూడొంతుల మంది లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వగా సాయంత్రం ఐదు గంటల సమయానికి జిల్లాలో సుమారు 88శాతం మందికి అందజేశారు. అధికారిక సమాచారం ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు సుమారు లక్షా 90వేల మంది లబ్ధిదారులకు రూ.82కోట్ల మేర పంపిణీ చేశారు. ఇదిలాఉండగా అన్నదాత సుఖీభవ నిధులను నేరుగా లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఈ వారంలో రైతు వారీ బ్యాంకు ఖాతా నెంబర్లు, ఆధార్‌ నెంబర్లను సేకరించారు. తదనగుణంగా వారి, వారి బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తాలను జమచేశారు. తొలిరోజైన శుక్రవారమే దాదాపు మూడొంతుల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమైనట్లు సమాచారం.

Updated Date - Oct 31 , 2026 | 02:00 AM