రైతుల ఖాతాల్లోకి రూ. 126.06 కోట్లు
ABN , Publish Date - Jun 21 , 2026 | 03:03 AM
ఈ ఏడాది అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధులు శనివారం విడుదలయ్యాయి. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 1,88,056 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.126.06 కోట్లు జమ అయ్యాయి.
అన్నదాత-సుఖీభవ ఈ ఏడాది తొలివిడత నిధులు విడుదల
కలికివాయిలో పాల్గొన్న మంత్రి బాలవీరాంజనేయస్వామి
ఒంగోలు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధులు శనివారం విడుదలయ్యాయి. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 1,88,056 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.126.06 కోట్లు జమ అయ్యాయి. ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ పథకం కింద అర్హులైన రైతులకు రూ.20వేల నగదును మూడు విడతలుగా అందజేస్తున్నాయి. అందులో ఈ ఏడాది తొలివిడత ఒక్కో రైతుకు రూ.7వేల నగదు శనివారం జమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ బెంగాల్‌లో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని పల్నాడు జిల్లా లింగంగుంట్లలో ప్రారంభించారు. ఆ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) స్థాయిలో లబ్ధిదారులైన రైతులు వీక్షించేలా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అదేసమయంలో ఆయా ప్రాంతాల్లో కీలక ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమాలకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా శనివారం సింగరాయకొండ మండలం కలికవాయిలో మంత్రి డాక్టర్ స్వామి పాల్గొన్నారు. మండల కేంద్రమైన గుడ్లూరులో కలెక్టర్ రాజాబాబు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావులు భాగస్యాములయ్యారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు రూరల్ మండలం ఉలిచిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముండ్లమూరు మండలం శంకరాపురంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీలు పాల్గొన్నారు. కాగా అద్దంకి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లాలో సీఎంతో కలిసి పాల్గొనగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయుమార్ అందుబాటులో లేకపోవడంతో చీమకుర్తిలో ఆ నియోజకవర్గ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్థానిక టీడీపీ నేతలు హాజరయ్యారు.