Share News

మురిగిపోయిన కోడిగుడ్లు

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:30 PM

కొత్తపట్నం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు మురిగిపోయి తినటానికి పనికిరాకుండా ఉన్నాయి. వారంక్రితం టెండర్‌దారుడు పాఠశాలలకు సరఫరా చేసిన కోడిగుడ్లును ఉడకబెట్టి విద్యార్థులకు అందజేద్దామంటే కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నాయి.

మురిగిపోయిన కోడిగుడ్లు
కుళ్లిపోవటంతో విద్యార్థులకు పెట్టకుండా పారేసిన కోడిగుడ్లు

ఉడకబెట్టి పారేస్తున్న కుకింగ్‌ ఏజెన్సీలు

సరఫరా చేసిన వాటిల్లో మూడొంతులు మురిగిపోయినవే

విద్యార్థులకు దూరమైన పౌష్టికాహారం

ఏజెన్సీ దృష్టికి తీసుకుపోయిన ఎంఈవో

కొత్తపట్నం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి) : కొత్తపట్నం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు మురిగిపోయి తినటానికి పనికిరాకుండా ఉన్నాయి. వారంక్రితం టెండర్‌దారుడు పాఠశాలలకు సరఫరా చేసిన కోడిగుడ్లును ఉడకబెట్టి విద్యార్థులకు అందజేద్దామంటే కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నాయి. దీంతో కుకింగ్‌ ఏజెన్సీ వాళ్లు వాటిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించకుండా పారేస్తున్నారు. గత వారంరోజులుగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువమంది విద్యార్థులకు కోడిగుడ్డు అందటం లేదు. 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో 10 గుడ్లు మాత్రమే బాగుంటున్నాయి. మిగిలిన 40 చెడిపోయినవే కావటంతో ఉపాధ్యాయులు వాటిని పారేయిస్తున్నారు. దీనికితోడు కుళ్లిపోయిన కోడిగుడ్లు కావటంతో ఉడకబెట్టే సమయంలోనే పగిలిపోయి దుర్వాసన వస్తున్నాయి. మండలంలో 41 ప్రాథమిక పాఠశాలలు, ఏడు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి గత వారంరోజులుగా కోడిగుడ్ల సరఫరా సక్రమంగా ఉండ టం లేదు. కోడిగుడ్లు కుళ్లిపోయినవి ఎందుకు పాఠశాలలకు వస్తున్నాయంటూ ఉపాధ్యాయులను తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మురిగిపోయిన కోడిగుడ్లు పాఠశాలలకు సరఫరా అయిన విషయాన్ని మండలంలోని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారి పద్మావతి దృష్టికి తీసుకుపోయారు. ఆమె ఈ విషయమై కోడిగుడ్లు సరఫరాదారులతో మాట్లాడారు. కుళ్లిపోయిన కోడిగుడ్లను విద్యార్థులకు వండిపెట్టవద్దని ఎంఈవో ఆదేశించారు.

కాంట్రాక్టర్‌ లోపం... ఉపాధ్యాయులపై నెపం

ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై పలుమార్లు సర్వే జరుపుతోంది. ఐవీ ఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వారి అభిప్రాయాలను సేకరిస్తోంది. తల్లిదండ్రులు భోజనం బాగులేదని చెబితే హెచ్‌ఎంల నుంచి వివరణ కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన టెండర్‌దారుడు నాసిరకంగా కోడిగుడ్లను సరఫరా చేస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు ఉండటం లేదు.


నిలిచిపోయిన రాగిజావ పంపిణీ

ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ ఉదయం 10.30 సమయంలో అందజేసేవారు. ఇందుకోసం బెల్లం, రాగిపిండి ప్రతినెలా పంపిణీ చేస్తోంది. ఏప్రిల్‌ మాసానికి సంబంధించి రాగిపిండి బెల్లం పంపిణీ జరగలేదు. ప్రభుత్వం అసలు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి ఇండెంట్‌ కూడా తీసుకోలేదు. దీంతో పాఠశాలల్లో ఈనెల ఒకటో తేదీ నుంచి రాగిజావ పంపిణీ కూడా నిలిచిపోయింది.

కుళ్లిపోయిన గుడ్ల స్థానంలో కొత్తవి

ఎంఈవో పద్మావతి

పాఠశాలలకు కుళ్లిపోయిన కోడిగుడ్లను సరఫరా చేసిన విషయం వాస్తవమే. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని తెలియజేయటంతో తనిఖీ చేశాను. విషయాన్ని సరఫరాదారుల దృష్టికి తీసుకుపోయాను. ఎన్ని చెడిపోయాయో వాటి స్థానంలో మంచి వాటిని సరఫరా చేస్తామని సరఫరాదారులు చెప్పారు.

Updated Date - Apr 16 , 2026 | 11:30 PM