సమ్మర్ క్యాంపుల్లో దోపిడీ
ABN , Publish Date - May 10 , 2026 | 03:06 AM
ఆటలు ఆ శాఖ అధికారులకు ఆదాయ వనరులుగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రూ.కోట్లు దోచుకున్న క్రీడా శాఖ తాజాగా ప్రజా ప్రభుత్వంలోనూ చేతివాటాన్ని చూపుతోంది.
వేసవి శిక్షణలో క్రీడాశాఖ చేతివాటం
పరికరాలు, డైట్ కోసం రూ.6.5లక్షలు కేటాయించిన శాప్
సమ్మర్ క్యాంపులు ప్రారంభమై వారం రోజులు
నేటికీ ఒక్కచోటా పైసా ఖర్చుచేయని వైనం
నిధులు లేవంటూ దాతల కోసం ఎదురుచూపులు
ఒంగోలు కార్పొరేషన్, మే 9 (ఆంధ్రజ్యోతి) : ఆటలు ఆ శాఖ అధికారులకు ఆదాయ వనరులుగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రూ.కోట్లు దోచుకున్న క్రీడా శాఖ తాజాగా ప్రజా ప్రభుత్వంలోనూ చేతివాటాన్ని చూపుతోంది. వేసవిలో విద్యార్థులకు క్రీడల్లో ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఆ అవకాశాన్ని ఆదాయ వనరులుగా మార్చుకున్న ఘనత జిల్లా క్రీడాభివృద్ధి శాఖకే దక్కుతుంది. సుమారు 25కిపైగా క్రీడలలో 55 శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మే 1 నుంచి31 వరకు శిక్షణ అందించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కు బాధ్యతను అప్పగించింది. శాప్ ఆధ్వర్యంలో క్రీడలలో శిక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.2.5 కోట్లు ఖర్చుచేస్తున్నారు. అందులోభాగంగానే ప్రకాశం జిల్లాకు రూ. 6,54,840 కేటాయించారు. ఈ నిధుల ద్వారా ఆయా క్రీడల కోసం అవసరమైన పరికరాల కొనుగోలుతోపాటు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాలని ఆదేశించింది. శిక్షణ శిబిరాలు ప్రారంభమై వారం రోజులు పూర్తయినా నేటికీ తర్ఫీదు పొందుతున్న వారికి ఒక్క పైసా ఖర్చు చేయకపోవడం ఆ శాఖ అధికారి తీరుపై అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఆ అధికారిపై ఆడుదాం ఆంధ్ర నిధులు భారీగా బొక్కేశారని ఆరోపణలు ఉండగా, ఆటల్లో అవినీతిపై విజిలెన్స్ విచారణ కూడా పూర్తయింది. కాగాఆడుదాం ఆంధ్ర నిర్వహణలో భారీగా నిధులు కాజేశారనేది వాస్తవమని తేల్చిన విజిలెన్స్ అధికారులు నివేదికను ప్రభుత్వానికి కూడా సమర్పించారు. తాజాగా సమ్మర్ క్యాంపుల్లోనూచేతివాటం చూపి, చిన్నారులకు కేటాయించిన నిధులు కూడా దోచేసేందుకు ఎత్తుగడలు వేయడంపై పలు క్రీడాసంఘాలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గత బుఽధవారం ఒంగోలు వచ్చిన శాప్ ఛైర్మన్ రవికుమార్‌నాయుడు పసిగట్టే వరకు బయటకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వేసవిలో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట
ఇరవై రోజుల క్రితం వరకు పుస్తకాలతో కుస్తీపడిన విద్యార్థులకు వేసవిలో ఉత్సాహం.. ఉల్లాసం.. ఆరోగ్యం అందించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. నెలరోజులపాటు వివిధ క్రీడల్లో క్రీడాశాఖ ఆధ్వర్యంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 31 వరకు జిల్లావ్యాప్తంగా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అర్బన్‌పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేశారు. ఒంగోలులో ఫుట్‌బాల్, సెపక్‌తక్రా, బాక్సింగ్, ఖోఖో, కరాటే, రైఫిల్ షూటింగ్, స్కేటింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, పవర్ లిఫ్టింగ్‌లతోపాటు, ఆర్చరీ, అథ్లెటిక్, ఫెన్సింగ్, చెస్, కబడ్డీ, బ్యాడ్మింటన్, జూడో క్రీడలలో శిక్షణ అందించనున్నారు. వైపాలెంలో అథ్లెటిక్స్, ఖోఖో, బ్యాడ్మింటన్,కనిగిరిలో బ్యాడ్మింటన్, ఖోఖో, మార్కాపురంలో బాక్సింగ్, వాలీబాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, జరుగుమల్లిలో పవర్ లిఫ్టింగ్, కారుమూడివారిపాలెంలో హ్యాండ్‌బాల్, పామూరులో బాల్‌బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ శిక్షణ ఏర్పాటు చేశారు. ఆలకూరుపాడులో వాలీబాల్, అల్లూరు వాలీబాల్, కరేడులో హ్యాండ్ బాల్, కబడ్డీ,సింగరాయకొండలో హ్యాండ్‌బాల్, ఎస్‌ఎన్‌పాడులో హాకీ, బ్యాడ్మింటన్, బిట్రగుంటలో వెయిట్‌లిఫ్టింగ్,పవర్ లిఫ్టింగ్, గిద్దలూరులో టెన్నిస్, పంగులూరులో ఖోఖో,కబడ్డీ, కొత్తపట్నంలో కబడ్డీ, పాకలలో కబడ్డీ, గొట్లగట్టులో కబడ్డీ, కొండపిలో తైక్వాండో క్రీడల్లో శిక్షణ అందిస్తున్నారు. నెలరోజులపాటు అందించే ఆయా శిక్షణలో నిపుణులైన జాతీయ క్రీడాకారులు కోచ్‌లుగా ఉంటారు. కాగా ఒక్కో క్రీడలో సుమారు 30మంది వరకు శిక్షణ పొందుతున్నారు.
ప్రతి రోజూ పౌష్టికాహారం ఏది ?
నెలరోజులపాటు విద్యార్థులకు వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలి. ప్రతిరోజూ క్రీడాకారులకు పౌష్టికాహారంగా పాలు, గుడ్డు, ఇతర బలమైన ఆహారాన్ని ఒక్కో రోజు ఒక్కో ఐటమ్ అందించాలని శాప్ ఆదేశించింది. అందుకోసం జిల్లాలోని 55 వేసవి శిక్షణ శిబిరాలకు రూ.6,55,84 మంజూరు చేసింది. వాటిలో పరికరాలకు రూ.2,32,440 ఖర్చుచేయాలని, విద్యార్ధులకు పౌష్టికాహారం కోసం రూ.2,57,400, మైదానాల సిద్ధం చేసేందుకు రూ.1,65,000 ఖర్చు చేయాలని తెలిపింది. అయితే ఈనెల 1వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణలు ప్రారంభమైనా క్రీడా పరికరాలు కొనుగోలు చేయలేదు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించకపోగా, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయనే విషయాన్ని దాచిపెట్టారు. పైగా క్రీడా పరికరాల కొనుగోలుకు దాతల సహాయం కోసం ఆ శాఖ అధికారి ఎదురుచూపులు చూడటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యేకించి గతంలో ఆడుదాం ఆంధ్రలో నిధులు కాజేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సమ్మర్ క్యాంపుల్లోనూ ప్రభుత్వం నిధులపైనా జిల్లా క్రీడాశాఖ అధికారి కన్నేసినట్లు పలు క్రీడాసంఘాలు, క్రీడాకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.