నిర్దేశిత ప్రమాణాలతో రోడ్డు నిర్మాణ పనులు
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:05 PM
రోడ్డు నిర్మాణ పనులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు.
మంత్రి గొట్టిపాటి
పంగులూరు, అక్ట్టోబరు 28(ఆంధ్రజ్యోతి) : రోడ్డు నిర్మాణ పనులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. మండలంలోని పంగులూరు, ముప్పవరం గ్రామాల మధ్య మూడు కోట్ల నిధులతో నిర్మితమవుతున్న నూతన రహదారి నిర్మాణ పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముప్పవరం గ్రామం వైపు ప్రయాణించే సమయంలో ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడంతో పాటురాకపోకలు సులభతరం చేసే లక్ష్యంతో ముప్పవరం, పంగులూరు మధ్య మూడుకోట్ల నిధులతో నూతన రహదారి నిర్మాణం చేపట్టామన్నారు. రహదారి నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడరాదని, పనుల్లో లోపాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నూతన రహదారి నిర్మాణం పూర్తయితే ముప్పవరం పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకల్లో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుందన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి కుక్కపల్లి ఏడుకొండలు, పీఏసీఎస్ అధ్యక్షుడు అల్లంనేని బ్రహ్మానందస్వామి, బోరెడ్డి ఓబుల్‌రెడ్డి, జగన్మోహనరావు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం బూదవాడలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కప్పల సురేష్ ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందగా మంత్రి గొట్టిపాటి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలో ఈమని నాగేశ్వరమ్మ గుండెపోటుకు గురై మరణించగా వారి కుటుంబ సభ్యులను మంత్రి గొట్టిపాటి పరామర్శించారు. మంత్రివెంట నేతలు కొమ్మారెడ్డి సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు అలవల రామిరెడ్డి, కుక్కపల్లి ఏడుకొండలు, అల్లంనేని బ్రహ్మానందస్వామి, గరిమిడి జగన్మోహనరావు, గొట్టిపాటి కాజాస్వామి పాల్గొన్నారు.