స్త్రీ శక్తి తో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గుముఖం
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:47 PM
ఔను..! చదవడానికి నిజంగా ఈ వార్త ఆశ్చర్యకరంగానే ఉంటోంది. పోలీసు అధికారులు విడుదల చేసిన గణాంకాలే అందుకు సాక్ష్యం. మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడంతో పాటు మరణాల శాతం గణనీయంగా తగ్గడం గమనార్హం.
మహిళలకు ఆర్టీసీ బస్‌లో ఉచితంతో పెరిగిన సురక్షిత ప్రయాణాలు
ప్రకాశం జిల్లా పోలీసుల అఽధ్యయనంలో బయటపడిన వాస్తవాలు
గతంతో పోల్చుకుంటే 10శాతం మరణాలు తగ్గినట్టు గుర్తింపు
ఇటీవల ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశంలో సీఎంకు ఎస్పీ నివేదిక
రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేయాలని చంద్రబాబు ఆదేశం
ఒంగోలు క్రైం, మార్చి 5(ఆంధ్రజ్యోతి) : ఔను..! చదవడానికి నిజంగా ఈ వార్త ఆశ్చర్యకరంగానే ఉంటోంది. పోలీసు అధికారులు విడుదల చేసిన గణాంకాలే అందుకు సాక్ష్యం. మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడంతో పాటు మరణాల శాతం గణనీయంగా తగ్గడం గమనార్హం. ఈ విషయం ప్రకాశం జిల్లా పోలీసుల అధ్యయనంలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయడు ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేసినప్పుడు ఎస్పీ వి.హర్షవర్థనరాజు రోడ్డు ప్రమాదాలపై నివేదికను అందజేశారు. స్త్రీ శక్తి పథకం అమలు వలన రోడ్డుప్రమాదాలు తగ్గినట్టు వివరించారు. అందుకు సంబంధించిన ప్రకాశం పోలీసులు చేసిన అధ్యయనం నివేదికను సీఎంకు వివరించి అందజేశారు.
పథకం ప్రారంభించిన తేదీ దగ్గర్నుంచి ఆరు నెలల కాలాన్ని, గతేడాది అదే తేదీల్లో ఆరునెలల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను పోలీసులు పోల్చి చూశారు. గణనీయంగా రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు మరణాల సంఖ్య తగ్గడం గమనార్హం.
స్ర్తీ శక్తి పథకం గతేడాది ఆగస్టు 15న ప్రారంభించారు... జిల్లాలో 2024 ఆగస్టు 15 నుంచి 2025 ఫిబ్రవరి 24వ తేదీ వరకు జరిగిన ప్రమాదాలలో పురుషులు 209, మహిళలు 42 మంది మృతి చెందారు. అదేవిధంగా 992 మంది పురుషులతోపాటు 138 మంది మహిళలు గాయపడ్డారు.
జిల్లాలో 2025 ఆగస్టు 15 నుంచి 2026 ఫిబ్రవరి 24వ తేదీ వరకు రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే 191 మంది పురుషులు, 34 మంది మహిళలు మృతి చెందారు. అలాగే 795 మంది పురుషులు, 94 మంది మహిళలు గాయపడ్డారు. అంటే 9 శాతం పురుషులు, 19 శాతం మహిళల మృతులు తగ్గారు. 20శాతం పురుషులు, 32 శాతం మహిళలు గాయపడిన వారు తగ్గారు.
స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన తరువాత ఈ ఆరు నెలల కాలంలో మహిళలు ప్రమాదాలలో మరణించిన వారు, గాయపడిన వారు సంఖ్య గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఆరు నెలలు అంటే పథకం ప్రారంభానికి ముందు 2025 ఫిబ్రవరి 3 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 56 మంది మృతి చెందగా, 169 మంది గాయపడ్డారు.
. అదే విధంగా పథకం ప్రారంభించాక 2025 ఆగస్టు 15 నుంచి 2026 ఫిబ్రవరి 24వ తేదీ వరకు 34 మంది మహిళలు మృతి చెందగా, 94 మంది గాయపడ్డారు. అంటే ఈ ఆరు నెలల్లో 39 శాతం మరణాలు, 44 శాతం గాయపడిన వారు తగ్గడాన్ని గమనించవచ్చు.
ప్రమాదాలు సైతం తగ్గుముఖం
స్త్రీ శక్తి శక్తి పథకం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే కాకుండా మరణాల సంఖ్య కూడా తగ్గడం ఆశ్చర్యకరమైన అంశం. ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలపై విశ్లేషణ చేసి ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ మేరకు ఎస్పీ హర్షవర్ధనరాజు ప్రమాదాల వివరాలను ముఖ్యమంత్రికి విన్నవించారు.