ధర్మవరంలో ఆర్‌ఎంపీ వైద్యుడు హత్య
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:19 PM
అద్దంకి మండలం ధర్మవరంలో ఆర్‌ఎంపీ వైద్యుడు మేడగం వెంకటకోటిరెడ్డి(47) హత్యకు గురయ్యాడు.
వివాహేతర సంబంధాలే కారణంగా అనుమానం
పరిశీలించిన డీఎస్పీ, క్లూస్‌టీమ్
అద్దంకి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి) : అద్దంకి మండలం ధర్మవరంలో ఆర్‌ఎంపీ వైద్యుడు మేడగం వెంకటకోటిరెడ్డి(47) హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. వెంకటకోటిరెడ్డి 25 ఏళ్లుగా గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తునట్లు సమాచారం. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ముగ్గురు వ్యక్తులు ముసుగులు, మాస్క్‌లు ధరించి వీరబ్రహ్మేంద్ర స్వామి మాలధారణలో ఉన్న కోటిరెడ్డి ఇంటికి వచ్చి తలుపు తట్టారు. తలుపు తీసిన అనంతరం కర్రలతో దాడి చేసి చంపేశారు. ఈ నేపథ్యంలో భర్తతో పాటు ఉన్న భార్య ఆదిలక్ష్మి ఈ సంఘటన చూసి స్పృహతప్పి పడిపోయింది. సుమారు గంట తరువాత తేరుకున్న ఆదిలక్ష్మి సమీప గృహాల వారికి తెలిపింది.
సమాచారం అందుకున్న దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, సీఐ సుబ్బరాజు ఆదివారం ఉదయం పరిశీలించారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్, ఇతర బృందాలు వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. వెంకట కోటిరెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు. పోలీసులకు అందిన ఫిర్యాదులో కూడా వెంకటకోటిరెడ్డికి ఉన్న వివాహేతర సంబంధాలను ప్రస్తావించటంతో అదేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్‌ఎంపీ వైద్యుడు వెంకటకోటిరెడ్డి హత్యతో ధర్మవరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకింత రాజకీయ కక్షలు ఎక్కువగా ఉండే ధర్మవరంలో హత్య జరిగిందని తెలిసిన వెంటనే మండల ప్రజలు ఉలికిపాటుకు గురయ్యారు. గతంలో కూడా పలుమార్లు గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకొని ఉండటంతో పోలీసులు సైతం అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెంకటకోటిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు కాగా వివాహాలయ్యాయి. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.