Share News

పదో తరగతి పరీక్షల్లో విప్లవాత్మక మార్పులు

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:05 AM

రాష్ట్రంలో వచ్చేనెల 16 నుంచి ప్రారంభమవుతున్న 10వతరగతి పరీక్షల్లో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమూల మార్పు లకు నాంది పలికింది.

పదో తరగతి పరీక్షల్లో విప్లవాత్మక మార్పులు

నియామకాలన్నీ డిజిటల్‌ విధానంలోనే..

నిర్వహణలో ప్రైవేటు టీచర్లకూ భాగస్వామ్యం

సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పూర్తిగా మినహాయింపు

ఇన్విజిలేటర్లుగా స్కూల్‌ అసిస్టెంట్లు, పీఈటీలు

ఒంగోలు విద్య, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో వచ్చేనెల 16 నుంచి ప్రారంభమవుతున్న 10వతరగతి పరీక్షల్లో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమూల మార్పు లకు నాంది పలికింది. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను కూడా పరీక్షల నిర్వహణలో భాగస్వాముల్ని చేస్తోంది. ఇప్పటి వరకు పరీక్షల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకాలకు అమలులో ఉన్న మాన్యువల్‌ విధానానికి స్వస్తి పలుకుతోంది. కేంద్రాల చీఫ్‌లు, డిపార్టుమెంటల్‌ అధికారులు, అదనపు డిపార్టుమెంట్‌ అధికారులు, ఇన్విజిలేటర్లను డిజిటల్‌ విధానంలో ఆటోమే షన్‌ పద్ధతిలో నియమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు 10వతరగతి పరీక్షల నిర్వహణలో సింహభాగంగా ఇన్విజిలేటర్లుగా నియమితులవుతున్న సెకండరీ గ్రేడు టీచర్లను పూర్తిగా పరీక్ష విధుల నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించారు.

ప్రైవేటు టీచర్లకు భాగస్వామ్యం

10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణలో చరిత్రలో మొట్టమొదటిగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను కూడా నియమిస్తున్నారు. పరీక్షా కేంద్రాలు చీఫ్‌లు, డీవోలు, అదనపు డీవోలను ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, సీనియర్‌ స్కూలు అసిస్టెంట్లను నియమించనున్నారు. పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్ల నియామకంలో ఈసారి ప్రైవేటు టీచర్లను కూడా అవకాశం ఇస్తున్నారు. అవసరమైన మొత్తం ఇన్విజిలేటర్లలో కనీసం 20 శాతం మందిని నియమించనున్నట్లు పాఠశాల విద్యా కమిషనరు విజయరామరాజు ప్రకటించారు. ఇప్పటివరకు పరీక్షల నిర్వహణకు కేవలం ప్రభుత్వ పాఠశాలల టీచర్లనే నియమిస్తుండటంతో పరీక్షలు జరిగినన్ని రోజులు ముఖ్యంగా హైస్కూలు, కొన్ని ఎలిమెంటరీ స్కూళ్లలో కేవలం కొద్దిమంది మాత్రమే ఉంటున్నారు. దీంతో పాఠశాలల్లో తరగతుల నిర్వహణ కష్టంగా మారింది. ఈ నేపఽథ్యంలో అన్ని హైస్కూళ్లలో తరగతుల నిర్వహణకు ఇబ్బందిలేకుండా కనీస సంఖ్యలో టీచర్లను కొనసాగించేందుకు ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లను నియమిస్తున్నారు.

డిజిటల్‌ విధానంలో నియామకాలు

10వతరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణలో అధికారులు, టీచర్ల నియామకానికి డిజిటల్‌ విధానాన్ని మొదటిసారిగా అమలు చేయనున్నారు. హెచ్‌ఎంలు, టీచర్ల వివరాలన్నీ ఉపాధ్యాయులు సమాచార వ్యవస్థ (టిన్‌)లో డిజిటల్‌ రూపంలో చీఫ్‌ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటి ఆధారంగా ఆటోమేషన్‌ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన చీఫ్‌లు, డీవోలు, అదనపు డీవోలు, ఇన్విజిలేటర్లను నియమించనున్నారు. వీరు పనిచేసే పాఠశాలలకు 10 కిలోమీటర్ల దూరంలోపు పరీక్షా కేంద్రాల్లో వీరిని నియమించేలా ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. 60 సంవత్సరాలు దాటిన వారు, దివ్యాంగులు, బాలింతలు, గర్భిణిలు ఇతర తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారిని పరీక్షల విధుల నుంచి మినహాయించనున్నారు. పరీక్షల విధులకు నియమితులైనవారు తప్పనిసరిగా డ్యూటీకి హాజరు కావాల్సిందే. సాకులతో డ్యూటీ నుంచి తప్పించుకునేందుకు అవకాశం లేదు.

ఇన్విజిలేటర్లుగా స్కూలు అసిస్టెంట్లు

10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లుగా స్కూలు అసిస్టెంట్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, పీఈటీలు, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌, సంగీతం, ఇతర సబ్జెక్టులు బోధించని వారిని మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం పరీక్షలకు, గణితం, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ టీచర్లను నియమించనున్నారు. అదేవిధంగా గ్రూపు సబ్జెక్టులు గణితం, సైన్సు, సోషల్‌ స్టడీస్‌ పరీక్షలకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు టీచర్లను నియమించనున్నారు. వీరు మొత్తంగా మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే పరీక్షల విధులు నిర్వహించనున్నారు.

Updated Date - Feb 11 , 2026 | 02:05 AM