ఆ ఓటర్లపై మళ్లీ విచారణ
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:50 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈనెల 24వ తేదీ వరకూ అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలో మిగిలిపోయిన 87,291 మంది ఓటర్లపై బీఎల్వోలు మరోసారి ఇంటింటికీ వెళ్లి విచారణ చేపట్టను న్నారు.
వివరాలు అందని వారు 9.61 శాతం
మార్కాపురం జిల్లాలో అలాంటి ఓటర్లు 87,291 మంది
వారిలో మృతులు, వలసదారులు 51,125
ఇంకా ఏ సమాచారం ఇవ్వని వారు 36,166
మార్కాపురం, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈనెల 24వ తేదీ వరకూ అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలో మిగిలిపోయిన 87,291 మంది ఓటర్లపై బీఎల్వోలు మరోసారి ఇంటింటికీ వెళ్లి విచారణ చేపట్టను న్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 9,08,772 మంది ఓటర్లు ఉండగా 8,21,481 (90.39 శాతం) మంది ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. మిగిలిన 87,291 మంది వివరాలు పూర్తిస్థాయిలో అందని కారణంగా వాటిని అన్‌కలెక్టబుల్ జాబితాలో ఉంచారు. బీఎల్వోల వద్ద ఉన్న సమాచారం మేరకు జిల్లాలో 22,127 మంది చనిపోయినట్టు సమాచారం. మరో 28,998 మందిని వలస వెళ్లిపోయిన వారి జాబితాలో చేర్చారు. మొత్తం మిగిలిపోయిన 87,291 మందిలో ఈ రెండు వర్గాలు కలిపి 51,125 మంది ఉన్నారు. ఇక మిగిలిన 36,166 మందికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. ఇప్పుడు బీఎల్వోలు ఈ 36,166 మందికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీస్తున్నారు. మరోవైపు డెత్ అని చూపిన వారికి కూడా సంబంధిత ఎవిడెన్స్ కావాల్సి ఉంది. డెత్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉండగా చాలామంది వద్ద అవి లేవు. దీంతో పంచనామా నిర్వహించి నిర్ధారించుకున్నాక వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటన్నింటిపై సమగ్రంగా విచారణ చేపట్టి పూర్తి వివరాలతో జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను తయారు చేయనున్నారు. అనంతరం నెల రోజులపాటు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరించి సెప్టెంబరు 28లోపు వాటిని పరిష్కరిస్తారు. అక్టోబరు 3న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు.