Share News

తిరోగమనం

ABN , Publish Date - May 08 , 2026 | 02:54 AM

దక్షిణాది పొగాకు మార్కెట్‌ తిరోగమనంలో సాగుతోంది. మున్ముందు మంచి ధరలు లభిస్తాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదుర వుతోంది. ధరలు పెరగకపోగా రోజురోజుకూ తగ్గుతున్నాయి.

తిరోగమనం
వ్యాపారుల తీరుకు నిరసనగా పొదిలి వేలం కేంద్రం ఎదుట రాస్తారోకో చేస్తున్న రైతులు

దిగజారుతున్న పొగాకు ధరలు

భారీగా బేళ్ల తిరస్కరణలు

ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో 57.12శాతం వెనక్కి

ఇంచుమించు సగం నోబిడ్‌లు

వెల్లంపల్లిలో ఏకంగా 77శాతం

మూడు చోట్ల సగానికిపైనే తిరస్కృతి

ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లోనూ అదే దుస్థితి

పొదిలిలో రోడ్డెక్కిన రైతులు

ఒంగోలు, మే 7 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్‌ తిరోగమనంలో సాగుతోంది. మున్ముందు మంచి ధరలు లభిస్తాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదుర వుతోంది. ధరలు పెరగకపోగా రోజురోజుకూ తగ్గుతున్నాయి. ఆయా వేలం కేంద్రాలకు అమ్మకాలకు వస్తున్న బేళ్లలో ఇంచుమించు సగం నోబిడ్‌ అవుతున్నాయి. మరో 10శాతం బేళ్లు వివిధ కారణా లతో వెనక్కిపోతున్నాయి. ఈ ప్రాంతంలో పొగాకు వేలం తీరును పరిశీలిస్తే మార్కెట్‌ పతనం అవుతున్నట్లు స్పష్టమవుతోంది. గురువారం మార్కెట్‌ మరింత దిగజారింది. పొగాకు రైతు పరిస్థితి దినదినగండంగా ఉంది. రోజురోజుకూ ధరలు పతనం అవుతుండటంతో దిక్కుతోచని స్థితి నెలకొంది. దక్షిణాదిలో ఒంగోలు కేంద్రంగా ఉన్న రెండు రీజియన్లలోని మూడు జిల్లాల పరిధిలో 11 వేలం కేంద్రాలున్నాయి. అందులో ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో ఐదు కేంద్రాలు ఉండగా వాటిలో గురువారం అమ్మకాలకు 1,495 బేళ్లు వచ్చాయి. అందులో కేవలం 641 మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే 57.12 శాతంతో 854 బేళ్లు తిరస్కరణలు జరిగాయి. వచ్చిన వాటిలో 721 బేళ్లను బోర్డు అధికారులు సూచించిన ధరలకు కొనేందుకు బయ్యర్లు ముందుకు రాకపోవడంతో అవి నోబిడ్‌ అయ్యాయి. అంటే నోబిడ్‌లు సుమారు 48.23 శాతంగా ఉన్నాయి.

ఫ వెల్లంపల్లి కేంద్రానికి 209 బేళ్లు రాగా 49 మాత్రమే కొను గోలు చేశారు. 77 శాతం వెనక్కి వెళ్లాయి. వాటిలో 137 (65.55 శాతం) నోబిడ్‌ అయ్యాయి. ఈ రీజయన్‌లోని ఒంగోలు-2

కేంద్రంలో 66 శాతం, కొండపిలో 54శాతం, ఒంగోలు -1 కేంద్రంలో 53శాతం తిరస్కరణలు జరిగాయి.

ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లోనూ ఇదే పరిస్థితి

ఫ ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లో ప్రకాశంలో రెండు, మార్కాపురం జిల్లాలో రెండు, నెల్లూరు జిల్లాలో మరో రెండు కేంద్రాలు ఉన్నాయి. ఆరు కేంద్రాలకు గురువారం 2,121 బేళ్లు అమ్మకానికి రాగా 1,470 వ్యాపారులు కొనుగోలు చేశారు. 651 తిరస్కరించారు.

ఫ ఈ రీజియన్‌లో ఎస్‌బీఎస్‌తో పోల్చితే తిరస్కరణలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ సాధారణం కన్నా అధికంగానే ఉన్నాయి.

ఫ ప్రధాన గ్రేడ్‌ల ధరలు దారుణంగా తగ్గిపోతున్నాయి. వేలం ప్రారంభం రోజున కిలోకు రూ.250 ఽవ్యాపారులు ఇచ్చారు. అది గత ఏడాది ప్రారంభం ధర కన్నా కిలోకు రూ.30 తక్కువగా ఉంది.

పతనమవుతున్న ధరలు

మార్కెట్‌ కాస్త కుదట పడ్డాక ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. అయితే పెరగకపోగా క్రమంగా ధరలు మరింత తగ్గిపోతున్నాయి. అలా ప్రస్తుతం మేలు రకం బేళ్ల ధర కిలో రూ.200కు దిగజారింది. ఆ ధరకు కూడా బయ్యర్లు సరిగా కొనడంలేదు. శాంపిల్స్‌ కోసం అవసరమైన బ్రౌన్‌, పచ్చలతో నాణ్యమైన బేళ్లను వారం క్రితం వరకు కిలో రూ.240 వరకు కొన్న బయ్యర్లు ఇప్పుడు వాటి ధరలను తగ్గించారు. ఈ పరిస్థితిపై పొగాకు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.

పొదిలిలో ఆందోళన

పొదిలి వేలం కేంద్రం వద్ద మార్కెట్‌ తీరుకు నిరసనగా రైతులు ఆందోళనకు దిగారు. కొంతసేపు వేలం నిలిపివేసి రాస్తారోకో చేశారు. కందుకూరు-1 కేంద్రం పరిధిలోని రైతులు ధరలు సరిలేనప్పుడు బేళ్లు తీసుకరావడం, వెనక్కి తీసుకెళ్లడం కష్టతరంగా భావించి అసలు అమ్మకాలకు తెచ్చేందుకు విముఖత చూపారు. దీంతో రోజూ మూడొంతులకుపైగా బేళ్లు వచ్చే ఆ కేంద్రానికి గురువారం 102 మాత్రమే తెచ్చారు. వాటి లోనూ 55 మాత్రమే బయ్యర్లు కొన్నారు. 47 తిరస్కరించారు. పలు ఇతర కేంద్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

Updated Date - May 08 , 2026 | 02:54 AM