Share News

‘ఉపాధి’ లబ్ధిపై ఆంక్షలు

ABN , Publish Date - Aug 18 , 2026 | 02:27 AM

కేంద్రం నూతనంగా తెచ్చిన వీబీ జీరామ్‌జీ పథకంలో ఉపాధి ద్వారా పొందే లబ్ధిపై ఆంక్షలు విధించారు. గతంలో ఈ పథకం పరిధిలో ఎన్ని స్కీంలు ఉన్నా వాటన్నింటినీ వినియోగించుకునే అవకాశం లబ్ధిదారులకు ఉంది. నిబంధనల ప్రకారం అర్హత గల వారికి వాటిని మంజూరు చేసి తద్వారా వచ్చే లబ్ధి ఎంత మొత్తం అయినా ఇచ్చేవారు.

‘ఉపాధి’ లబ్ధిపై ఆంక్షలు

అన్నీ కలిపి ఒక కుటుంబానికి రూ.4లక్షలే!

వీబీ జీరామ్‌జీలో పరిమితి విధింపు

గతంలో ఎన్ని రకాల పథకాలకైనా అనుమతి

ఇప్పుడు షరతులతో క్షేత్రస్థాయిలో ప్రతికూల ప్రభావం

ఒంగోలు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : కేంద్రం నూతనంగా తెచ్చిన వీబీ జీరామ్‌జీ పథకంలో ఉపాధి ద్వారా పొందే లబ్ధిపై ఆంక్షలు విధించారు. గతంలో ఈ పథకం పరిధిలో ఎన్ని స్కీంలు ఉన్నా వాటన్నింటినీ వినియోగించుకునే అవకాశం లబ్ధిదారులకు ఉంది. నిబంధనల ప్రకారం అర్హత గల వారికి వాటిని మంజూరు చేసి తద్వారా వచ్చే లబ్ధి ఎంత మొత్తం అయినా ఇచ్చేవారు. అలాంటిది నూతన చట్టంలో ఒక కుటుంబానికి గరిష్ఠంగా రూ.4లక్షలు పరిమితి విధించారు. ఈ పథకంలో అనేక స్కీంలు ఉండగా తాజా చట్టంలో నిర్దేశించిన రూ.4లక్షల పరిమితి అమలు చేస్తే పండ్లతోటల పథకం కింద ఎంపికైన లబ్ధిదారునికి మరొక స్కీం ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే పండ్లతోటల పథకం కింద ఐదు ఎకరాలు మంజూరు చేస్తే వారికి మూడేళ్లలో ఇచ్చే ఆర్థిక సాయం రూ.4 లక్షలు దాటిపోతుంది. గతంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) అమలులో ఉన్నప్పుడు కూలీలకు వేతనాలు లభించే పనుల కల్పనతోపాటు మెటీరియల్‌ కోటా నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సామాజిక, వ్యక్తిగత ప్రయోజనం ప్రత్యేకించి గ్రామీణ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ఉపకరించేవి ఉండేవి. సామాజిక అంశాలలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్‌లు, పాఠశాలలు, శ్మశానాలు, పలు భవన నిర్మాణాలు భారీగా చేపట్టేవారు. అలాగే గ్రామీణ ప్రజల జీవనోపాధి మెరుగు, జలసంరక్షణలో భాగంగా విస్తారంగా పండ్లతోటల పెంపకం, పశువుల షెడ్ల నిర్మాణం, పొలాల్లో పంట కుంటలు, ఇళ్ల వద్ద ఇంకుడు గుంతల తవ్వకాలు, పేదల పక్కాగృహాల నిర్మాణం వంటి అనేక స్కీంలకు ఈ నిధులు మంజూరు చేసేవారు. పండ్లతోటల పథకంలో గరిష్ఠంగా ఐదు ఎకరాల పరిమితి ఉండగా మూడేళ్ల వ్యవధిలో ఎకరాకు రూ.లక్ష వరకు లబ్ధిచేకూరేది. పంట కుంటలకు ఒక్కొక్కరికి రూ.10వేలు సగటున అందేవి. అలా ఒక రైతు తన భూమిలో ఎన్ని అయినా తవ్వుకునే అవకాశం ఉండేది. పశువుల షెడ్ల నిర్మాణానికి రూ.2 లక్షలు మంజూరు చేసేవారు.

పరిమితి విధింపుతో ఆందోళన

గతంలో ఒక కుటుంబానికి పండ్లతోటల పెంపకం, పశువుల షెడ్ల నిర్మాణం, పంట కుంటలు, ఇంకుడు గుంతల తవ్వకాలు, ఇతరత్రా ఎన్ని స్కీంలైనా మంజూరు చేసి వాటి ద్వారా వచ్చే ఆర్థిక లబ్ధిపై పరిమితి లేకుండా అందజేసే వారు. కూలీలకు కల్పించే పనులకు వీరు కూడా వెళ్లవచ్చు. అయితే తాజా చట్టం నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి అన్ని స్కీంలు కలిపి రూ.4లక్షలు మించి లబ్ధి అందే అవకాశాలు లేవు. ఆ మేరకు పరిమితి విధించారు. అంటే నాలుగు ఎకరాల పండ్లతోటల స్కీం మంజూ రు చేస్తే సదరు రైతుకు ఇక పంట కుంటలు, పశువుల షెడ్‌ ఇతరత్రా మంజూరు చేసే అవకాశం లేదు. ఈ విధానంతో క్షేత్రస్థాయిలో పథకాల అమలులో ఆటంకాలు ఏర్పడతాయ న్న ఆందోళన ఆ శాఖ సిబ్బందిలోనే వ్యక్తమ వుతోంది. కూలీలకు పనుల కల్పన ద్వారా ఇచ్చే వేతనాలను రూ.4లక్షల పరిమితికి లింక్‌ పెట్టకపోవడం ఊరట కలిగించే అంశం.

Updated Date - Aug 18 , 2026 | 02:27 AM